మారని మిల్లర్ల తీరు
ధర తగ్గించి ధాన్యం కొనుగోలు
అదును చూసి ధర తగ్గింపు
ఆయకట్టు పరిధిలో ప్రధానంగా చింట్లు, హెచ్‌ఎంటీ, మహేంద్ర చింటు రకాల సన్న ధాన్యాన్ని రైతులు పండించారు. మార్కెట్‌లో ధరలు బాగా ఉండడంతో నెల రోజుల కిందటి నుంచి రైతులు తమ పొలాల్లో కోసిన ధాన్యాన్ని మిల్లుల వద్దకు తీసుకొస్తున్నారు. రైతుల రాక పెరగడంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు ధాన్యం ధరలు తగ్గించారు. దీంతో రైతులు చేసేదేమీ లేక, మరో రోజు వేచి ఉండాలంటే ట్రాక్టర్ కిరాయి భారం పడుతుందనే భయంతో వ్యాపారులు అడిగిన రేటుకు ధాన్యం ఇచ్చి వెళ్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ, మిర్యాలగూడ : వానాకాలం వరి కోతలు పూర్తికావొచ్చినా మిల్లర్ల తీరు మారడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను మిల్లర్లు సిండికేట్‌గా మారి ధర తగ్గించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు.. మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ధర విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2320 కూడా ఇవ్వడం లేదు. కోతలు ప్రారంభమైన సమయంలో ధాన్యం క్వింటా రూ.2700 నుంచి రూ.2800 పలకగా.. కోతలు ముమ్మరంగ సాగిన సమయంలో రూ.2500 నుంచి రూ.2400 వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం రూ.2100 నుంచి రూ.2200 వరకే చెల్లిస్తున్నారు. దీంతో పెట్టి పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సన్నాలను ప్రభుత్వం
కొనుగోలు చేసింది తక్కువే..
జిల్లాలో సన్న ధాన్యాన్ని ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో చాలా తక్కువగా కొనుగోలు చేశారు. తేమ 17 శాతానికి మించి ఉంటే కేంద్రాల్లో కొనడం లేదు. దీంతో రైతులు పది నుంచి 15 రోజుల పాటు కల్లాల్లో ధాన్యం ఆరబోసుకొని వేచి ఉండాల్సి వస్తోంది. నిర్దేశిత తేమ శాతం వచ్చే వరకు ధాన్యాన్ని కాపాడుకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు వేచి ఉండలేక కోసిన ధాన్యాన్ని 25 శాతం వరకు తేమ ఉన్నా మిల్లుల్లో అమ్ముకునేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సాధారణ రకం ధాన్యం 1,90,980 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేస్తే, సన్న ధాన్యం 37,435 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతాదంతా మిల్లులకే వెళ్తోంది.
తప్పిన అంచనా..
జిల్లాలో ఈ వానాకాలంలో జిల్లాలో 12 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని.. అందులో సన్నరకం 2.80 లక్షల టన్నులు, సాధారణ (దొడ్డు) రకం 4.70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని లెక్కలు వేశారు. మిగతా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కొంతమేర రైతులు తమ అవసరాల కోసం నిల్వ చేసుకోగా.. మిగతా ధాన్యం పూర్తిగా మిల్లుల ద్వారానే విక్రయిస్తారని వ్యవసాయ శాఖ పేర్కొంది. కానీ ఈ అంచనాలు తప్పాయి.
ఫ కోతలు ప్రారంభంలో క్వింటాకు రూ.2800 వరకు చెల్లింపు
ఫ ఇప్పుడు రూ.2100 నుంచి రూ.2200 వరకే..
ఫ పెట్టుబడి కూడా వెళ్లదని రైతుల ఆవేదన
దిగుబడి తగ్గింది
నీటి ఎద్దడి కారణంతో బోర్ల కింద వానాకాలంలో నాలుగు ఎకరాలు సాగు చేశా. ఎకరాకు 30 బస్తాలే దిగుబడి వచ్చింది. ధాన్యం రైస్ మిల్లుకు తీసుకెళ్లగా క్వింటాకు రూ.2,200 చొప్పున కొనుగోలు చేశారు. ఆర్ధికంగా బాగా నష్టపోయా.
– భూక్య చక్రు, తిమ్మాపురం
సాగు చేసినా ఫలితం లేదు
మూడెకరాల్లో వరిసాగు చేపట్టా. 90 బస్తాల దిగుబడి వచ్చింది. తీరా అమ్ముకుందామని మిల్లులకు వెళ్తే క్వింటాకు రూ.2300 ధర చెల్లించారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి ధాన్యానికి ధర తగ్గించారు. శ్రమించి సాగు చేసినా ఫలితం లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి సైతం ఎల్లక ఆర్థికంగా దెబ్బతిన్నా.
– కోట లక్ష్మయ్య, కల్లేపల్లి
Comments
Please login to add a commentAdd a comment