జాగ్రత్తలతోనే.. చలినుంచి రక్షణ
ఫ జనరల్ ఫిజీషియన్, డాక్టర్ మాతృ సూచన
నల్లగొండ : చలి తీవ్రత బాగా పెరిగింది. ఈ చలిలో చిన్న పిల్లలు, పెద్దలు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ చలికి వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుని చలి నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మాతృ.
● చలి తీవ్రత పెరిగితే చిన్న పిల్లల్లో నిమోనియా వచ్చే అవకాశం ఉంది. నిమోనియా వస్తే అస్తమాతోపాటు వైరల్ ఫీవర్ కూడా వస్తుంది. చిన్న పిల్లలను ఎప్పుడూ వెచ్చగా ఉంచాలి. చేతులు, కాళ్లు, తలకు ఉన్ని దుస్తులు వేయాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్న పిల్లలను బయటకు తీసుకురావద్దు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
● వృద్ధులు, గుండె జబ్బులున్న వారు, అస్తమా రోగులు, టీబీ పేషెంట్లు, షుగర్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికి రక్తం చిక్కబడే ప్రమాదం ఉంటుంది. అస్తమా రోగులు జాగ్రత్తలు తీసుకోకపోతే మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాలు మూసుకుపోయి శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే వెంటనే ఆస్పత్రి వెళ్లాలి. టీబీ, షుగర్ వ్యాధిగ్రస్తులు సాయంత్రం చలి ప్రారంభం కాకముందే ఇళ్లు చేరడం మంచిది.
● చలికాలం ఎక్కువగా దాహం వేయదు కాబట్టి నీరు తాగరు. మూత్రం అధికంగా వస్తుందని కూడా నీరు తాగరు. అది మంచిది కాదు. నీరు సరిపడా తాగాలి. ప్రధానంగా మాంసాహారానికి దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment