సైన్స్ ఎగ్జిబిషన్ వాయిదా
నల్లగొండ : ఈ నెల 19, 20 తేదీల్లో జరగనున్న సైన్స్ ఎగ్జిబిషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఇతర ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యే అవకాశం లేనందున సైన్స్ ఎగ్జిబిషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు డీఈఓ బి.బిక్షపతి తెలిపారు. తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ విషయం గమనించాలని సూచించారు.
విద్యార్థులు
ఇష్టపడి చదవాలి
చింతపల్లి : ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఇష్టపడి చదవాలని డీఐఈఓ దస్రూనాయక్ సూచించారు. బుధవారం చింతపల్లిలోని జయేందర్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలన్నారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలవాలన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ దన్‌రాజ్, అధ్యాపకులు ఉన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
నల్లగొండ : మినిస్టీరియల్ ముసఫిల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం టీఎన్‌జీఓ భవన్‌లో ఎన్నుకున్నారు. జిలా అధ్యక్షుడిగా నామా రామసురేంద్రనాథ్, కార్యదర్శిగా శ్యాంసుందర్, కోశాధికారిగా రుద్రాక్షి భిక్షంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ నాయకులు ఎన్.మురళి, జె.శేఖర్‌రెడ్డి, డిఐ.రాజు, సీహెచ్.నర్సింహాచారి, విజయకృష్ణ, బి.రణదేవ్ పాల్గొన్నారు.
చెర్వుగట్టులో తలనీలాల సేకరణకు వేలం
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలోని గట్టుపైన భక్తులు సమర్పించే తలనీలాల సేకరణకు బుధవారం హైదరాబాద్‌లో వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో గుంటూరు జిల్లా కోలకలూరు చెందిన వ్యక్తి రూ.1,39,00,000 దక్కించుకున్నారు. సదరు వ్యక్తి ఏడాదిపాటు దేవాలయం ఆవరణలో తలనీలాల సేకరించుకునే హక్కు కలిగి ఉంటారని దేవాలయ ఈఓ నవీన్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ సురకంటి ఇంద్రసేనారెడ్డి తెలిపారు. దేవాలయ నిబంధనల ప్రకారం డబ్బు చెల్లించని పక్షంలో టెండర్ రద్దు చేస్తారని పేర్కొన్నారు.
నేడు అసెంబ్లీ ముట్టడి
నల్లగొండ: చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు కోరారు. మాలమహానాడు జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ గురువారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అన్ని మల్ల లింగస్వామి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అంగరాజు స్వర్ణలత, భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కూచుమల్ల లలిత, జ్యోత్స్న, దామల్ల విజయ, రొయ్య కిరణ్, ముడుసు భిక్షం, ముసుకు పృథ్వీ, అద్దంకి వెంకన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment