సంక్రాంతికి 400 ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ), మిర్యాలగూడ టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. తద్వారా ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రాష్ట్ర రాజధానితోపాటు, వివిధ ప్రధాన పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంత ఊర్లకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా పండుగకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు పూనుకుంది. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణికులతో బస్సుల్లో రద్దీ నెలకొననున్న నేపథ్యంలో రూట్ల వారీగా బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏ డిపో నుంచి ఎన్ని బస్సులు నడిపించాలో కూడా ఇప్పటికే నిర్ణయించారు. స్పెషల్ బస్సుల్లో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఉండనున్నాయి. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల ద్వారా అదనపు చార్జీలు వసూలు చేసే యోచనలో సంస్థ యంత్రాంగం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఏడు డిపోల నుంచి..
నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, నల్లగొండ డిపోల నుంచి మొత్తం 400 బస్ సర్వీసులను నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, తిరిగి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణిలకు రద్దీని బట్టి బస్సులను నడిపిస్తారు. ముఖ్యంగా 9వ తేదీన 38 బస్సులు, 10న 110, 11న 130, 12న 90, 13న 32 బస్సు సర్వీసులను నడపనున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఎల్‌బీ నగర్ బస్టాండ్ వద్ద జిల్లాకు చెందిన ఇద్దరు డిపో మేనేజర్‌లతో పాటు డిప్యూటీ ఆర్‌ఎం స్థాయి వారిని సిబ్బందిగా నియమించారు.
ఫ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడపనున్న ఆర్టీసీ
ఫ 9 నుంచి 13వ తేదీ వరకు
అందుబాటులోకి అదనపు సర్వీసులు
ఫ తిరిగి 15 నుంచి 20 వరకు కూడా..
ఫ ఉమ్మడి జిల్లాలోని
ఏడు డిపోల్లో ఏర్పాట్లు
అన్ని ఏర్పాట్లు చేశాం
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నల్లగొండ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే మా లక్ష్యం. బస్సులకు రిజర్వేషన్ల అవకాశం కూడా కల్పించాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. చార్జీల పెంపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఒకవేళ సంస్థ నిర్ణయం తీసుకుంటే చార్జీల పెంపు ఉంటుంది.
– జానిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment