5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ | - | Sakshi
Sakshi News home page

5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌

Published Thu, Jan 9 2025 2:27 AM | Last Updated on Thu, Jan 9 2025 2:27 AM

5వేల

5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌

ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్‌ గెలలు టన్నుకు రూ.20,506 ధర పలుకుతోంది. పతంజలి సంస్థ వారు జిల్లాలో ఆయిల్‌పామ్‌ గెలలను కొనుగోలు చేయడంకోసం అనుముల, త్రిపురారం మండలం ముకుందాపురం, నిడమనూరు మండలం ముప్పారం, మాడుగుల మండలం కుక్కడం, నల్లగొండ మండలం చందనపల్లిలో కలెక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు నేరుగా ఆయా కేంద్రాలకు తీసుకెళ్తే వెంటనే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు.

ఇప్పటికి 2 వేల ఎకరాల్లో నాటిన మొక్కలు

సాగుపై విస్తృత అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన శాఖ

మార్చి చివరినాటికి టార్గెట్‌ పూర్తిపై దృష్టి

రాయితీలు కల్పిస్తుండడంతో సాగుపై రైతుల ఆసక్తి

నల్లగొండ అగ్రికల్చర్‌: జిల్లాలో ఆయిల్‌పామ్‌ తోటల సాగుపై ఉద్యానవన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10,400 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేశారు. అయితే ఈ ఏడాదికి గాను 5 వేల ఎకరాల్లో తోటలు సాగు చేయాలని ఉద్యానవన శాఖ లక్ష్యం నిర్ధారించింది. ఇందులో భాగంగా గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేశారు. 600 ఎకరాలకు ప్రభుత్వం నుంచి మంజూరు లభించింది. మార్చి నాటికి మరో 2,400 ఎకరాల్లో సాగు చేయించేందుకు ఉద్యానవన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.

సాగుకు ప్రోత్సాహం ఇలా..

ప్రస్తుతం మార్కెట్‌లో ఆయిల్‌పామ్‌ గెలలకు మంచి డిమాండ్‌ ఉంది. ప్రభుత్వం కూడా తోటల సాగుకు రైతులకు ప్రోత్సాహం అందిస్తోంది. పంట చేతికి వచ్చేంత వరకు నాలుగేళ్ల పాటు ప్రభుత్వమే ఎరువులు, అంతర్‌ పంటసాగుకు ఏటా ఎకరాకు రూ.4,200 ఇస్తోంది. ఎకరాకు 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 సబ్సిడీ ఇస్తుండగా ఇందులో రైతువాటా రూ.20 మాత్రమే. దిగుబడి నాలుగేళ్లలో ప్రారంభమై 30 ఏళ్ల వరకు వస్తుంది. ఇదేకాక పెద్ద రైతులకు 80 శాతం, చిన్న రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు నూరు శాతం, బీసీలకు 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం డ్రిప్‌ పరికరాలు అందిస్తోంది. దీనిపై ఉద్యానవన శాఖ కూడా అవగాహన కల్పిస్తుండడంతో తోటల సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు.

ఆయిల్‌ తయారీ

యూనిట్‌ ఏర్పాటుకు..

గెలల నుంచి ఆయిల్‌ తయారీ చేసే యూనిట్‌ను నిర్మించడానికి పతంజలి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా పలు సందర్భాల్లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయిల్‌ తయారీ యూనిట్‌ నిర్మాణం చేపట్టాలని పతంజలి సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆయిల్‌ తయారీ ఫ్యాక్టరీని పూర్తి చేస్తే జిల్లాలోనే ఆయిల్‌పామ్‌ గెలల దిగుమతులకు డిమాండ్‌ ఉండనుంది.

టన్ను ధర రూ.20,506

ఆయిల్‌పామ్‌ నర్సరీలు

ఏర్పాటు చేసిన గ్రామాలు

మండలం గ్రామం

మర్రిగూడ ఇందూర్తి

కేతేపల్లి కేతేపల్లి

నాంపల్లి నాంపల్లి

పెద్దవూర లింగంపల్లిల,

తిప్పలమ్మగూడెం

కట్టంగూరు ఇనుపాముల

మంచి లాభాలు ఉంటాయి

ఆయిల్‌పామ్‌ తోటల సాగుకు చౌడు భూములు మినహా నీటి సౌకర్యం ఉన్న అన్నిరకాల భూములు అనుకూలంగా ఉంటాయి. మార్కెట్‌లో ఆయిల్‌పామ్‌ గెలలకు మంచి డిమాండ్‌ ఉంది. తోటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేస్తే మంచి లాభాలు ఉంటాయి.

– వీవీఎస్‌ సాయిబాబ,

జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment
5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ 1
1/1

5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement