నేషనల్ యూత్ ఫెస్టివల్‌కు నీతూసింగ్ ఎంపిక
నల్లగొండ టూటౌన్: న్యూ ఢిల్లీలో ఈనెల 11, 12 తేదీల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యే నేషనల్ యూత్ ఫెస్టివల్‌కు నల్లగొండ పట్టణ పరిధిలోని పానగల్‌కు చెందిన నీతూసింగ్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన యువతీయువకులతోపాటు స్పెషల్ అతిథి యూత్ ఐకాన్‌గా నీతూసింగ్ హాజరు కానున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం నీతూసింగ్ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ సందర్బంగా నీతూసింగ్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ఏబీవీపీ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
చింతపల్లి: భూ నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న మర్రి గూడ మండలం నర్సిరెడ్డిగూడెం గ్రామ భూ నిర్వాసితులతో బుధవారం చింతపల్లిలోని సాయి సుమంగళి గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 289మందికి మండల కేంద్రంలోని 154 సర్వే నంబర్‌లో పునరావాసం కింద ప్లాట్లను డ్రా పద్ధతిన కేటాయించారు. అనంతరంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఈఈ రాములు, డీఈ కాశీం, ఏఈ రఘు, మర్రిగూడ, చింతపల్లి తహసీల్దార్లు శ్రీనివాస్, రమాకాంత్ శర్మ, ఆర్‌ఐలు సునీత, రామారావు, మండల సర్వేయర్ రతన్‌లాల్, సిబ్బంది పాల్గొన్నారు.
పదోన్నతిపై డీఆర్‌ఓ బదిలీ
నల్లగొండ : నల్లగొండ డీఆర్‌ఓగా పనిచేస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అమరేందర్ పదోన్నతి పై బదిలీ అయ్యారు. జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న ఆయనను నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా బదిలీ చేస్తూ ప్రభుత్వ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలి
చింతపల్లి: పీహెచ్‌సీలు, ఉపకేంద్రాల్లోని వైద్యులు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం చింతపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కేస రవి, పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఇక్బాల్, సిబ్బంది ఉన్నారు.
గుట్ట ఇన్‌చార్జ్‌సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
యాదగిరిగుట్ట రూరల్, యాదగిరిగుట్ట: నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌లోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేయడంతో యాదగిరిగుట్ట ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గోపినాయక్ బుధవారం సస్పెండ్ అయ్యారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సర్వే నంబర్ 472, 473లో 154 డాక్యుమెంట్‌లను డిసెంబర్ 21, 22, 23వ తేదీల్లో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం స్టాంప్స్ అండ్ డ్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన విచారణ కు ఆదేశించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అధికారి మధుసూదన్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఆడిట్ రిజిస్ట్రార్ అశోక్‌కుమార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బుధవారం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డీటీసీపీ పర్మిషన్ లేకుండా, కేవలం నాలా పర్మిషన్‌తోనే ఈ భూమిని, 154 డాక్యుమెంట్‌లుగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా నిర్ధారించారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌లోని ప్లాట్‌లను రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ గోపి నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌లను ప్రొహిబీటెడ్‌లో పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment