కాంగ్రెస్ పాలనలో నల్లగొండ ఆగమైంది
నల్లగొండ టూటౌన్: కాంగ్రెస్ పాలనలో నల్లగొండ ఆగమైందని, గులాబీ జెండాలను చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భయం పట్టుకుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రూ. 1500 కోట్లతో నల్లగొండను అభివృద్ధి చేశామని, ప్రతి గ్రామంలో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు. తాము చేసిన అభివృద్ధిపై చర్చ పెడదామని, ఎప్పుడైనా, ఎక్కడికై నా రావొచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నల్లగొండలో కరువు, ఫ్లోరైడ్ పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అతి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ నుంచి దాడుల పాలిటిక్స్ మొదలు పెట్టిందని విమర్శించారు. గ్రామ సభల్లో ప్రభుత్వ డొల్లతనం బయట పడిందని, దరఖాస్తులు చెత్తబుట్టల్లో వేసి మళ్లీ స్వీకరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎంత ధాన్యం పండించారో చెప్పలేని అసమర్థ ప్రభుత్వమని, రైతు బందు, రుణమాఫీ ఎగ్గొట్టి మోసం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కంచర్ల భూపాల్‌రెడ్డి, సైదిరెడ్డిపై ఎందుకు దాడిచేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సీఎం, మంత్రుల ఒత్తిడితో రైతుల ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత నల్లగొండలో రైతు ధర్నా చేసి తీరుతామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదన్నారు. తమ నాయకుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. పోలీసులు, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు చెరుకు సుధాకర్, కంచర్ల కృష్ణారెడ్డి, మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
తిరుగుబాటు తప్పదు..
సూర్యాపేటటౌన్: నల్లగొండ జిల్లాలో పోలీసులు, కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తుందని జగదీష్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ శ్రేణుల అరెస్టుపై ఆయన మండిపడ్డారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలిపెట్టి కావాలనే నల్లగొండ మున్సిపాలిటీ అధికారులు బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు చించేశారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. భూపాల్‌రెడ్డిని, పార్టీ శ్రేణులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ నుండే ఉద్యమం మొదలవుతుందన్నారు. కాంగ్రెస్ హఠావో తెలంగాణా బచావో నినాదం మొదలైందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో ప్రజల నుంచి వస్తున్న నిరసనలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు మొదలైందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, అర్హత లేని వారికి లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.
ఫ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి చర్చకు రావాలి
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్
Comments
Please login to add a commentAdd a comment