ఫ ఈసారైనా సూర్యాపేట వాసుల
రైలు కల నెరవేరుతుందా..
ఫ జాతీయ రహదారి వెంట రైలు మార్గానికి అడుగులు పడతాయా..
ఫ రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులొస్తాయా..
ఫ నేటి బడ్జెట్‌లో తేలనున్న కేటాయింపులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వివిధ పథకాల ద్వారా రైతులకు, ఇతర రంగాలకు ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందన్న అంచనాలు వేసుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు కేంద్రం సహకారం, రీజినల్ రింగ్ రోడ్డుకు నిధుల కేటాయింపుపైనా ఆశలు నెలకొన్నాయి. వాటితోపాటు రైల్వే ప్రాజెక్టుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈసారి కేంద్రం ఏ మేరకు నిధులను ఇస్తుందనేది శనివారం ప్రవేశ పెట్టనున్నబడ్జెట్‌లో తేలనుంది.
ఏళ్ల తరబడి ఎదురుచూపులే..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే కనెక్టివిటీ కోసం జిల్లా వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతేడాది సూర్యాపేట మీదుగా శంషాబాద్ నుంచి విశాఖపట్నం హైస్పీడ్ రైల్వే కారిడార్‌కు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి కర్నూలుకు, శంషాబాద్ నుంచి విశాఖపట్నానికి లైన్ కోసం ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను నిర్వహించింది. ఒక లైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట జిలా కేంద్రం, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరనుంది. మరో లైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూలు చేరనుంది. ఈ బడ్జెట్‌లో ఆయా పనులకు నిధులు కేటాయిస్తారా.. లేదా? చూడాలి.
బుల్లెట్ ట్రైన్‌కు అడుగులు ముందుకు పడేనా?
హైదరాబాద్ – విజయవాడ మధ్యలో బుల్లెట్ ట్రైన్ కోసం.. గతంలో నల్లగొండ ఎంపీగా పని చేసిన మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు కేంద్రానికి, రైల్వే బోర్డుకు, దక్షిణ మధ్య రైల్వేకు దీనిపై లేఖలు రాశారు. ప్రస్తుత ఎంపీ రఘువీర్‌రెడ్డి కూడా జాతీయ రహదారి వెంట రైలు మార్గం కావాలని ప్రతిపాదించారు. ఇక, ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణకు ఓకే చెప్పిన కేంద్రం ఈసారైనా నిధులను ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ – కాజీపేట మధ్య మూడో లైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా? లేదా? తేలనుంది.
రీజినల్ రింగు రోడ్డుకు నిధులు ఇచ్చేనా?
ఉమ్మడి జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు కేంద్రం ఈసారి నిధులను కేటాయిస్తుందనే అంచనాల్లో రాష్ట్రం ఉంది. ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డుకు ఆమోదం తెలిపిన కేంద్రం ఈ బడ్జెట్‌లో నిధులను కేటాస్తుందా? లేదా? అన్నది నేడు తేలనుంది. ఇక, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చి సహకరించాలని రాష్ట్రం కోరుతోంది.
డోర్నకల్ – గద్వాల లైన్ అయ్యేనా
సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్‌ఎల్‌ఎస్ చేపట్టేందుకు గతంలో రూ.7.40 కోట్లు కేటాయింది. తప్ప విడుదల కాలేదు. ఈసారైనా అందుకు నిధులను కేటాయిస్తుందా?లేదా? చూడాలి. ఇక మాచర్ల – నల్లగొండకు 92 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌ను రూ.458.26 కోట్లతో చేపట్టేందుకు ఎప్పుడో ఆమోదించిన కేంద్రం 2023 బడ్జెట్‌లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో రూ.11.30 లక్షలు ఖర్చు చేసింది. 2024 బడ్జెట్‌లో పైసా ఇవ్వలేదు. విష్ణుపురం–జాన్‌పహడ్ 11 కిలోమీటర్ల రైల్వే లైన్, జగ్గయ్యపేట– మేళ్లచెరువు లైన్‌కు ఈసారైనా నిధులు ఇస్తుందా? లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment