ఎల్‌ఆర్‌ఎస్‌కు విముఖత
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యురైజేషన్ స్కీం)కు ప్లాట్ల యజమానులు విముఖత చూపుతున్నారు. రూ.వెయ్యి చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు.. ఆయా స్థలాలకు మున్సిపల్ అధికారులు ఆమోదం తెలిపినా ఫీజు చెల్లించడానికి ముందుకు రావడంలేదు. అవసరమైనప్పుడు చేయించుకోవచ్చనే దోరణితో కొందరు, విక్రయించే ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ చేయించినా అదే ధర వస్తుందనే కోణంలో మరికొందరు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు దరఖాస్తు చేసుకున్న తరువాత ప్లాట్ల క్రయ, విక్రయాలు జరగడంతో వారి ఫోన్ నంబర్లు మారడంతో వారికి సమాచారం అందక కూడా ఫీజు చెల్లించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇటీవల మున్సిపాలిటీలకు కొత్తగా వార్డు ఆఫీసర్లు రావడంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
14,702 దరఖాస్తులకు ఆమోదం..
జిల్లాలోని నందికొండ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 72,647 మంది రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 732 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వివిధ కారణాలతో 93 దరఖాస్తులను మూసివేశారు. 37,814 దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 14,702 మంది స్థలాలకు అనుమతి లభించగా.. ఇప్పటి వరకు 662 మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మిగతా 14,040 మంది ఫీజు చెల్లించడానికి ముందుకు రావడంలేదు. మున్సిపాలిటీల్లోని సంబంధిత ప్లాట్ల యజమానులకు ఫోన్‌లు చేస్తున్నా వారి నుంచి సరైన స్పందన ఉండడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇల్లు కట్టుకునే వారు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకోవడానికి వస్తున్నారు తప్పితే స్వయంగా ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్ కోసం రావడంలేదు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై చివరి తేదీ అంటూ ఏదీ పెట్టకపోవడం కూడా ఓ కారణమనే చర్చ సాగుతోంది.
14 శాతం చెల్లించాలి..
అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు డాక్యుమెంట్‌పై ఉన్న ధరలో 14 శాతం ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి అప్పటి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లకు మాత్రమే భవన నిర్మాణ అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ కొనసాగుతోంది.
గ్రీన్‌బెల్ట్ దరఖాస్తుల తిరస్కరణ ..
మున్సిపాలిటీల్లో ఉన్న గ్రీన్ బెల్ట్, ఇండస్ట్రీస్ ఏరియాల నుంచి వందలాది మంది తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు తిరస్కరించారు. ఇక.. ప్రభుత్వ భూములు, శిఖం భూములు, గుట్టలు, రహదారుల స్థలాలు, కాల్వ, చెరువు భూములను కూడా కొందరు రియల్టర్లు కబ్జాలు చేసి వెంచర్లలో కలుపుకొని ప్లాట్లు చేసి విక్రయించారు. ఆయా స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. తిరస్కరణకు గురయ్యే దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఫ ఫీజు చెల్లించేందుకు ముందుకురాని యజమానులు
ఫ అధికారుల నుంచి ఆమోదం
లభించినా.. ఆచీతూచి ఆడుగులు
ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి
ప్రత్యేక బృందాలతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేస్తాం. దరఖాస్తుదారులు ముందుకొచ్చి ఫీజు చెల్లించి తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలి.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్, నల్లగొండ
ఎల్‌ఆర్‌ఎస్ కోసం
వచ్చిన దరఖాస్తులు
మున్సిపాలిటీ దరఖాస్తులు
నల్లగొండ 36,116
మిర్యాలగూడ 14,320
దేవరకొండ 5,022
చండూరు 3,619
చిట్యాల 3,208
హాలియా 3,418
నకిరేకల్ 6,944
మొత్తం 72,647
Comments
Please login to add a commentAdd a comment