ప్రజలు కోట్లను తరిమికొడతారు | Sakshi
Sakshi News home page

ప్రజలు కోట్లను తరిమికొడతారు

Published Thu, Apr 18 2024 9:40 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి - Sakshi

ఎక్కడా సీటు లేక డోన్‌కు వచ్చాడు

సొంతూరు లద్దగిరికి రోడ్డు వేసుకోలేని

వ్యక్తి డోన్‌కు రోడ్లు వేశారట

నా వెంట వస్తే అభివృద్ధిని చూపిస్తా

టీడీపీని ప్రజలు నమ్మరు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

బేతంచెర్ల: సీనియర్‌ నాయకుడని చెప్పుకునే టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి ఆలూరు సీటు ఇవ్వలేమంటే, ఎమ్మిగనూరు కుదరదంటే, ఆదోనిలో సాధ్యపడదంటే, కర్నూలులో కాదంటే.. చివరకు డోన్‌కు వచ్చాడని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేసిన కోట్లను ప్రజలు డోన్‌ నుంచి తరిమేస్తారన్నారు. బుధవారం పట్టణంలోని షిర్డీ సాయి కల్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడారు. నియోజకవర్గంలో గ్రామాల పేర్లు కూడా తెలియని నాయకులు డోన్‌లో అభివృద్ధి ఏదీ అని అడుగుతున్నారన్నారు. తన వెంట వస్తే దగ్గరుండి అభివృద్ధిని చూపిస్తానన్నారు. కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఉన్నత పదవులు అనుభవించిన కోట్ల తన సొంత గ్రామం లద్దగిరికి రోడ్డు వేసుకోలేదని, అలాంటి వ్యక్తి డోన్‌లో రోడ్లు వేశారంటే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. కేంద్ర రైల్వే మంత్రిగా కోచ్‌ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. వర్ష పాతం ఆధారంగా బేతంచెర్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ప్రతిపక్షాలకు కడుపుమంట ఎందుకన్నారు.

మాది చేతల ప్రభుత్వం..

టీడీపీది అబద్దాల ప్రభుత్వమైతే వైఎస్సార్‌సీపీది సంక్షేమ ప్రభుత్వమన్నారు. అర్హతనే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. 2014లో ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో పుట్టిన ప్రతి ఆడ బిడ్డకు రూ. 25 వేలిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సిలిండర్‌ కూడా ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు బసుపాసులు ఇవ్వాలన్నా రాయితీలతో ఆర్టీసీ నష్టపొతుందని మనసులో మాట పుస్తకం ద్వారా తన మనస్సులో మాట చెప్పారన్నారు. గతంలో పింఛన్లు, డీ పట్టాలు దగ్గర నుంచి ఏ ప్రభుత్వ సేవ అందాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు తీసుకున్న చరిత్ర టీడీపీది అన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి 99 శాతం అమలు చేశారన్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత అభివృద్ధి చెందిన ప్రాంతం డోన్‌ నియోజకవర్గం అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దానన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో డోన్‌ అభ్యర్థిగా తనను, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని మంత్రి బుగ్గన అన్నారు. కార్యక్రమంలో మంత్రి బుగ్గన తనయుడు అర్జున్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హాజరైన కార్యకర్తలు, నాయకులు
1/1

హాజరైన కార్యకర్తలు, నాయకులు

Advertisement
Advertisement