చ..చ..చ.. చలి
కర్నూలు(అగ్రికల్చర్): కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాలో చలి గజగజ వణికిస్తోంది. డిసెంబరు నెల రాక ముందే చలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రానున్న రోజుల్లో చలి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఊహించడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి సమయానికి రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకొని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు విస్తరించి.. ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంగి ఉంది. వచ్చే రెండు రోజుల్లో వాయువ్య దిశకు కదిలే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల చలి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సాధారణంగా ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 18 డిగ్రీల వరకు నమోదు అవుతాయి. నవంబరు నెల ద్వితీయ పక్షంలోనే ఉష్ణోగ్రతలు పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 15 నుంచి 17 డిగ్రీల వరకు మాత్రమే నమోదు అవుతున్నాయి. రాత్రి 8 గంటలకే చలి తీవ్రత పెరుగుతుండటంతో దుప్పటి కప్పుకోవాల్సి వస్తోంది. ఉదయానికి చలి ప్రభావం మరింత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు కూడా చలి పులి భయంతో బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. చలి ప్రభావం పెరుగుతుండటంతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తులు, అలర్జీ వంటి సమ స్యలు పెరిగిపోతున్నాయి. ఎముకలు కొరికే చలి వల్ల వృద్ధులు, చిన్న పిల్లలు అల్లాడుతున్నారు. గురువారం కర్నూలు జిల్లాలోని అత్యల్పంగా ఆలూరు, గూడూరు ల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే నమోదైంది. ఎమ్మిగనూరులో 15.1, కోసిగిలో 15.6, ఆదోనిలో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నంద్యాల జిల్లాలో అత్యల్పంగా మిడుతూరులో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్యాపిలిలో 15.8, గడివేములలో 15.9, డోన్‌లో 16.2, జూపాడుబంగ్లాలో 16.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజు ల్లో చలి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది.
రాత్రి 8 గంటల నుంచే చలి..
ఉదయానికి మరింత తీవ్రత
15 డిగ్రీలకు పడిపోయిన
రాత్రి ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment