మధ్యలో నిలిచిపోయిన సంజామల కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణం
జిల్లాలో రెండో విడతలో 973 పాఠశాలలు ఎంపిక
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.366 కోట్లు మంజూరు
సర్కారు బడులపై కూటమి సర్కార్ కక్ష
నాడు– నేడుకు పైసా విదిల్చని వైనం
జిల్లాలో ఎక్కడికక్కడే నిలిచిపోయిన పనులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. నాడు– నేడు మనబడి కార్యక్రమం ద్వారా సర్కార్ బడుల రూపురేఖలు మార్చేసింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలకు సకల హంగులు కల్పించింది. కానీ కూటమి ప్రభుత్వంలో నాడు–నేడు పనులకు ‘చంద్ర’గ్రహణం పట్టింది. ఫలితంగా 973 ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి. పనులు పూర్తయితే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనుల పురోగతికి మోకాలడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. – కోవెలకుంట్ల
జిల్లా వ్యాప్తంగా 1,213 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1.75 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నాడు–నేడు మనబడి కార్యక్రమం కింద గత ప్రభుత్వం మొదటి విడతలో 486 పాఠశాలలు ఎంపిక చేసి రూ.117 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ఏడాదిన్నర క్రితం రెండవ విడతలో 973 పాఠశాలలు ఎంపిక చేసి రూ.366 కోట్లు కేటాయించి ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. సర్కారు బడులను అధునాతనంగా తీర్చిదిద్ది కార్పొరేట్‌కు ఽధీటుగా వసతులు కల్పించింది. ఇంగ్లీష్ మీడియం, ఐఎఫ్‌సీ ప్యానల్, డిజిటల్ విధానంలో బోధన, టోఫెల్ విధానంలో పరీక్షలు, సీబీఎస్‌ఈ సిలబస్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర పథకాలు అందించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు గదులు, తరగతి గదుల మరమ్మతులు, తాగునీరు, బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన కొనసాగించింది.
కూటమి రాకతో నిలిచిన రెండో విడత పనులు
రెండవ విడతలో జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో నాడు–నేడు పనులు స్తంభించాయి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండి విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో రెండో విడతలో 973 ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఎంపిక చేసి వీటిల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.366 కోట్లను మంజూరు చేసింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికి దాదాపు 70 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనులు నెమ్మదించాయి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టింది. ఏడు నెలలు కావస్తున్నా పెండింగ్ పనులకు పైసా నిధులు విడుదల చేయలేదు. ఈ ఏడు నెలల్లో ఒక్కసారి కూడా నాడు–నేడు పనులపై సమీక్ష లేదంటే ఈ ప్రభుత్వానికి సర్కార్ బడులంటే ఎంత నిర్లక్ష్యమో అద్దం పడుతోంది. రాష్ట్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో అటు పేరెంట్స్ కమిటీలు, ఇటు హెచ్‌ఎం, ఇంజినీరింగ్ అధికారులు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనను పూర్తిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థులకు తప్పని తిప్పలు
కూటమి ప్రభుత్వం మిగిలిపోయిన పనులపై దృష్టి సారించకపోవడంతో పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ, టోఫెల్ పరీక్ష విధానం తదితర వాటికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికై నా మిగిలిపోయిన నాడు– నేడు పనులు పూర్తి చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment