ఇస్తెమాకు సర్వం సిద్ధం!
ఆత్మకూరు: పట్టణ శివారులో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ఇస్తెమా జరుగనుంది. ఈ ధార్మిక సమ్మేళనానికి ఉమ్మడి కర్నూలు జిల్లా, వైఎస్సార్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దాదాపు 300 ఎకరాల్లో ఇస్తెమా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు స్వచ్ఛందంగా వాహనాల్లో తరలివచ్చి మైదానం చదును, చలువ పందిళ్ల ఏర్పాటు తదితర పనుల్లో పాలుపంచుకుంటున్నారు. అలాగే విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా తదితర సౌకర్యాల కల్పన పనులు తుదిదశకు చేరాయి. ఈ సమ్మేళనలో మత గురువులు ఇస్లాం ధర్మం సందేశం ఇవ్వనున్నారు. కాగా ఇస్తెమా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ కమిటీ సభ్యులు రజాక్ వెల్లడించారు.
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
ఇస్తెమాకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. 40 మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ లు, హెడ్‌కానిస్టేబుళ్లు, 150 మంది పోలీసులతో పాటు ఐదుగురు డీఎస్పీలు, ఓ ఏఎస్పీ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు డీఎస్పీ రామాంజినాయక్ వెల్లడించారు.
17 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు
వివిధ ప్రాంతాల నుంచి ఇస్తెమాకు 2లక్షలకు పైగా ముస్లింలు తరలివచ్చే అవకాశం ఉండటంతో 17 చోట్ల వాహనాల పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిలో 10, నంద్యాల, కడప ప్రాంతం నుంచి వచ్చే వారికి ఆత్మకూరు, నల్లకాలువ పరిధిలో ఏడు పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇస్తెమాకు వచ్చే వారు ఆయా పాయింట్లలోనే వాహనాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా 40 బస్సులు ఏర్పాటు
ఇస్తెమాకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ అధికారులు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల, కర్నూలు నుంచి 20 చొప్పు న బస్సులు నడపనున్నట్లు నంద్యాల ఆర్టీసీ ఆర్‌ఎం సుల్తానా బేగం తెలిపారు. సరిపోకపోతే అదనంగా మరికొన్ని బస్సులు తిప్పుతామని వెల్లడించారు.
శానిటేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ
ఇస్తెమా ప్రదేశంలో శానిటేషన్ పనులకు మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు 150 మంది సిబ్బందిని నియ మించారు. షిప్ట్‌లు వారీగా రాత్రి, పగలు వారు అక్కడ విధులు నిర్వహిస్తారు. మూడురోజుల పాటు స్నా నాలు, బాత్‌రూమ్‌లకు నీటి సౌకర్యం కల్పించారు.
రేపటి నుంచి ఆత్మకూరు శివారులో మూడురోజుల పాటు ధార్మిక సమ్మేళనం
తరలిరానున్న లక్షలాది ముస్లింలు
తుది దశకు చేరిన ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment