కుట్ర కనిపింఛన్! | - | Sakshi
Sakshi News home page

కుట్ర కనిపింఛన్!

Published Mon, Jan 6 2025 7:38 AM | Last Updated on Mon, Jan 6 2025 5:27 PM

.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు

.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు

అనంతపురం జిల్లా నుంచి రానున్న వైద్యులు

ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

పింఛన్‌ లబ్ధిదారుల తొలగింపునకు అత్యుత్సాహం

గత నెల ఉమ్మడి జిల్లాలోని రెండు సచివాలయాల్లో పరిశీలన

లబ్ధిదారులకు మిగిలింది మానసిక వేదనే!

కర్నూలు(అగ్రికల్చర్‌): పక్షవాతం, కండరాల బలహీనత(క్షీణత)తో మంచానికి పరిమితమైన వారు, రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న బాధితులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఎలాంటి రాజకీయ సిఫార్సులకు అవకాశం లేకుండా, అర్హతే ప్రామాణికంగా పింఛన్లు అందించి ఔదార్యం చూపింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దివ్యాంగ, హెల్త్‌ పింఛన్లు తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పింఛన్‌ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని టీడీపీ నేతలతోపాటు ‘పచ్చ’ మీడియా సైతం ప్రచారం చేస్తోంది. డిసెంబరు 9న జిల్లాకు ఒక సచివాలయం పరిధిలోని మొత్తం పింఛన్లను పరిశీలన చేయించి.. రాష్ట్రం మొత్తం మీద 5 శాతం( 580) పింఛన్‌ లబ్ధిదారులకు అర్హత లేదని చెప్పించింది. వీరికి నోటీసులు ఇవ్వాలని, సమాధానం వచ్చిన తర్వాత తొలగించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించి చివరి క్షణాల్లో వెనక్కి తీసుకుంది. తాజాగా దివ్యాంగ, హెల్త్‌ పింఛన్ల తొలగింపు కోసమే పరిశీలన జరపనున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నేటి నుంచి పరిశీలన

కర్నూలు జిల్లాలో 413, నంద్యాల జిల్లాలో 873 ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,286 ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను రీ– అసెస్‌మెంట్‌ చేయనున్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లాకు మూడు, నంద్యాల జిల్లాకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఇద్దరు వైద్యు నిపుణులు ఉంటారు. అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు ఆరుగురు, నంద్యాల జిల్లాకు ఆరుగురు వైద్యులు రానున్నారు. పక్షవాతంతో రూ.15 వేలు పింఛన్‌ పొందుతున్న వారు ప్రస్తుతం వీల్‌చైర్‌ మీద ఉన్నారా... బెడ్‌పై ఉన్నారా అనే దానిని ఈ వైద్యులు పరిశీలించనున్నారు. పక్షవాతంతో పింఛన్‌ అందుకుంటున్న వారు నంద్యాల జిల్లాలో 672, కర్నూలు జిల్లాలో 227 మంది ఉన్నారు. అదేవిధంగా కండరాల బలహీనత(క్షీణత), రోడ్డుప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న బాధితులను కూడా డాక్టర్ల బృందం పరిశీలిస్తుంది. ఇటువంటి పింఛన్లు అందుకుంటున్న వారు కర్నూలు జిల్లాలో 186, నంద్యాల జిల్లాలో 201 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వ చర్యలతో పింఛన్‌ లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. తమ పింఛన్‌ ఉంటుందో.. ఊడుతుందోనన్న భయం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ

హెల్త్‌, దివ్యాంగ పింఛన్ల రీ వెరిఫికేషన్‌, రీ అనాలసిస్‌ను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. అనర్హులని తేలితే ఈ కమిటీనే నోటీసులు ఇస్తుంది. నోటీసులకు జవాబులు వచ్చిన తర్వాత వాటిని ఈ కమిటీ పరిశీలించి ఏరివేత నిర్ణయం తీసుకుంటుంది. చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌. కన్వీనర్‌గా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌ఓ, డిస్ట్రిక్‌ కో–ఆర్డినేటర్‌ హాస్పిటల్‌ సర్వీస్‌, జిల్లా కుష్టు నివారణ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జెడ్పీ సీఈఓ, జీఎస్‌డబ్ల్యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌, మున్సిపల్‌ కమిషనర్లు, పోలీసు అధికారులు సభ్యులు ఉంటారు. రీవెఫికేషన్‌ వివరాలను సంబంధిత టీమ్‌ లీడర్లు మొబైల్‌ యాప్‌లో నమోదు చేస్తారు.

ఈ చిత్రంలో ఉన్న మహిళ పేరు షేక్‌ బడేబీ. కర్నూలు బుధవారపేటకు చెందిన ఈ మహిళ వయస్సు 64 ఏళ్లు. పింఛన్‌దారుడైన ఈమె భర్త చాంద్‌బాషా గత ఏడాది ఫిబ్రవరిలో మృతిచెందారు. వితుంతు పింఛన్‌ కోసం ఈమె దరఖాస్తు చేసుకుంది. అయితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని, ప్లాట్‌ ఉందంటూ ఆమె దరఖాస్తును రిజెక్ట్‌ చేశారు. దీంతో పింఛన్‌ వస్తుందో.. లేదోనని ఆమె ఆందోళన చెందుతోంది.

.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.

సామాజిక భద్రత పింఛన్లు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగ, హెల్త్‌ పింఛన్లలో కోత వేసేందుకు పరిశీలనకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించేందుకు అనంతపురం జిల్లా నుంచి వైద్యులను పంపుతోంది. ఈ విషయం తెలియడంతో దివ్యాంగ, హెల్త్‌ పింఛన్లు అందుకుంటున్న వారిలో ఆందోళన నెలకొంది.

అంతా వంచన

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లింలు 2 లక్షల మందికిపైగా ఉండగా... వీరిలో కనీసం లక్ష మంది అర్హులు ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు పూర్తవుతున్నా హామీ అమలు కాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రతి వారం కలెక్టరేట్‌, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలు, మండలాల్లో జరిగే గ్రీవెన్స్‌కు వెళ్లి కొత్త పింఛన్ల కోసం వినతులు ఇస్తున్నారు.

హెల్త్‌, దివ్యాంగ పింఛన్‌ లబ్ధిదారుల వివరాలు..

జిల్లా, హెల్త్‌ పింఛన్లు; దివ్యాంగ పింఛన్లు; మొత్తం

కర్నూలు; 227; 186; 413

నంద్యాల; 672; 201; 873

మొత్తం; 899; 387; 1,286

11,460 పింఛన్ల తొలగింపు...

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది జూన్‌ నెలతో పోలిస్తే జనవరి నెల వరకు పింఛన్లను అడ్డుగోలుగా తొలగించారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు వెనువెంటనే నోటీసులు ఇచ్చి పింఛన్లు తొలగించడం సర్వసాధారణం అయ్యింది. గత ఏడాది జూన్‌ నెలలో ఉమ్మడి జిల్లాలో 4,67,389 పింఛన్లు ఉండగా.. డిసెంబరు నాటికి 4,55,929కు తగ్గాయి. అంటే 11,460 పింఛన్లను గుట్టుచప్పడు కాకుండా తొలగించారు. గత నెలలో కర్నూలు జిల్లా ఎరుకల చెరువు, నంద్యాల జిల్లా కానాల–2 సచివాలయం పరిధిల్లో డోర్‌టుడోర్‌ పింఛన్లను పరిశీలించగా ఎలాంటి అనర్హులు లేరని తేలింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement