గణతంత్ర వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిద్దాం
● ఏర్పాట్లపై అధికారులతో సమీక్షలో జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 26వ తేది గణతంత్ర వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దడంతో పాటు జాతీయ పతాక ఆవిష్కరణ, పరేడ్ మార్చ్ ఫాస్ట్‌లో సాయుధ దళాలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్లు తదితర కంటిజెంట్స్ అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదు శాఖలకు రోలింగ్ షీట్‌లు ప్రదానం చేస్తామన్నారు. దేశభక్తి ఉట్టిపడేలా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబిచేలా వ్యవసాయం, డీఆర్‌డీఏ, హౌసింగ్, వైద్యం, డ్వామా, వ్యవసాయ అనుబంధ రంగాలు ఏర్పాటు చేసే శకటాలు ప్రత్యేకంగా ఉండాలన్నారు. గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రికలను ముందుగానే ప్రచురించి ప్రోటోకాల్ ప్రకారం అందరికీ పంపిణీ చేయాలన్నారు. గత పొరపాట్లు పునరావృతం కాకుండా వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ రాము నాయక్, సీపీఓ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ జనార్దన్ రావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, డీఈఓ జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment