ఇస్తెమా షురూ
ఆత్మకూరు: పట్టణ శివారులో మూడురోజుల ఇస్తెమా ప్రారంభమైంది. తొలి రోజే వేలాది మంది తరలివచ్చారు. కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది వరకు ముస్లింలు చేరుకోవడంతో ఇస్తెమా ప్రదేశం కిటకిటలాడుతోంది. మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, ఆయన బోధనలను పాటించాలని చెప్పారు. సత్ప్రవర్తనతో మెలిగి ధర్మం, న్యాయం, సమానత్వాన్ని కాపాడాలన్నారు. ఐదుపూటల నమాజ్ చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడపాలని సూచించారు.
బయాన్ సమయం
ఆత్మకూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఇస్తెమాలో ఉదయం 6.15 నుంచి 8 గంటల వరకు, ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, రాత్రి 6.10 నుంచి 9 గంటల వరకు బయాన్ కార్యక్రమం ఉంటుందని ఇస్తెమా కమిటీ సభ్యులు తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మతపెద్దలు వివిధ అంశాలపై ప్రసంగిస్తారని వెల్లడించారు.
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ఇస్తెమా ప్రదేశాన్ని, ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు 500 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు నియమించామన్నారు. ప్రధానంగా నేడు, రేపు లక్షలాదిగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడ కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామంజినాయక్ ఉన్నారు. ఇదిలా ఉంటే నేడు మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు జిల్లా అధికారులు ఇస్తెమాకు హాజరు కానున్నట్లు సమాచారం.
ఆత్మకూరుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్న ముస్లింలు
కిటకిటలాడుతున్న ఇస్తెమా ప్రదేశం
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు
Comments
Please login to add a commentAdd a comment