సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నంద్యాల (వ్యవసాయం): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం జిల్లాలోని అన్నీ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా తెలిపారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 115 బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుగు ప్రయాణం కోసం 14వ తేది నుంచి 19వ తేది వరకు 60 బస్సులు నడుపుతామన్నారు. ఈ బస్సుల్లో రానుపోను టికెట్లను ఆన్‌లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం రాయితీ వస్తుందని వెల్లడించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు
జూపాడుబంగ్లా: లేబర్ బడ్జెట్ పూర్తిచేయకపోవడంతో తాటిపాడు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ చిన్నలింగన్నను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. ఈమేరకు బుధవారం ఉపాధిహామీ పథకం పీడీ ఎం.జనార్దనరావు ఉత్తర్వులు జారీచేసినట్లు ఏపీఓ గౌరీబాయి తెలిపారు. సదరు ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో ఉపాధి పనులు కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. అలాగే 15, 16, 18 సోషల్ ఆడిట్లలో అవినీతి ఆరోపణలు సైతం వచ్చాయన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
గోస్పాడు: ఫార్మసిస్ట్ ఉద్యోగాల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్న నేపథ్యంలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకటరమణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను ఈనెల 17వ తేది సాయంత్రం 5 గంటలలోపు ప్రాంతీయ సంచాలకులు వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం కడపలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు cfw.ap.gov.in వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.
స్టాఫ్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకులో ఖాళీగా ఉన్న 50 స్టాప్ అసిస్టెంటు పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 13 పోస్టులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పని చేసే సిబ్బందికి కేటాయించారు. మొత్తం పోస్టుల్లో 29 పోస్టులు జనరల్, 21 పోస్టులు మహిళలకు కేటాయించారు. రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ఈ నెల 8 నుంచి అప్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుల అప్‌లోడ్‌కు ఈ నెల 22వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం www. kurnool dccb. com వెబ్‌సైట్ ను సందర్శించవచ్చని డీసీసీబీ అధికార వర్గాలు తెలిపాయి.
ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం మంది హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం జరిగిన ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షల్లో 90 శాతం హాజరు నమోదైందని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 2,4,6,8,10 సెమిస్టర్ పరీక్షలకు 553 మందికి 496 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. కర్నూలు ఉస్మానియా కళాశాల పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సందర్శించి పరిశీలించారు. ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్ పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కేసీ కాలువ కాలుష్యంపై సీపీసీబీకి, పీఎంఓకు ఫిర్యాదు
కర్నూలు కల్చరల్: నగరంలోని కేసీ కాలువ భారీగా కాలుష్యంతో నిండిపోయిందని న్యాయవాది కె.గణేష్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి, పీఎంఓకు ఫిర్యాదు చేశారు. కాలువలో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలిసిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. కాలుష్యం వల్ల దోమలు పెరిగి, వ్యాధులు వ్యాప్తి చెందడంతోపాటు జలచరాలు నశించి పోతున్నాయని వివరించారు. తాగునీరు కలుషితమై అనారోగ్యం పాలవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కార్పొరేషన్, నీటి వనరుల శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment