స్వయం ఉపాధికి తోడ్పడండి
నంద్యాల: బీసీ, ఈబీసీ వర్గాల్లోని పేదల ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బీసీల స్వయం సమృద్ధి రుణాల మంజూరుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024 –25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ, ఈ బీసీ వర్గాలకు వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సర్వీసులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో 2,156 మంది బీసీలకు రూ. 45.84 కోట్ల రుణాలు వివిధ పథకాల కింద అందించాలన్నారు. అలాగే ఈబీసీకి సంబంధించి 73 యూనిట్లకు 1.27 కోట్లు , కమ్మ కార్పొరేషన్ కింద 15 యూనిట్లకు 26 లక్షలు, రెడ్డి కార్పొరేషన్ కింద 45 యూనిట్లకు 78 లక్షలు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా 26 యూనిట్లకు 45 లక్షలు, బ్రాహ్మిన్ కార్పొరేషన్ కింద 10 యూనిట్లకు 17 లక్షల మేర స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వీటన్నింటినీ పరిశీలించి అవసరమైన, అర్హత గల వ్యక్తులకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలన్నారు. 21 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ వర్గాల వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో ఈనెల16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్, ఎల్డీఎం రవీంద్ర కుమార్, యూబీఐ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సురేంద్ర గౌడ్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ మనోహర్, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ సుందర రాము తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment