ప్రవక్త మార్గం అనుసరణీయం
ఆత్మకూరు: ప్రవక్త మార్గం అనుసరణీయమని.. ప్రతి ఒక్కరూ ఆచరించాలని మౌల్వీలు ఖాజాసాహెబ్, ముఫ్తీ ఫరూక్ ముస్లింలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు శివారులో నిర్వహిస్తున్న ఇస్తెమాకు రెండోరోజు భారీగా ముస్లింలు తరవలివచ్చారు. కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు ప్రకాశం తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. బుధవారం ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మత పెద్దలు మాట్లాడుతూ ఇస్లాం గొప్ప తనాన్ని వివరించారు. ప్రతి ముస్లిం అల్లా ఆరాధనలో గడపాలని సూచించారు. తోటి వారి పట్ల శాంతి, కరుణ, ప్రేమతో మెలుగుతూ, కష్టాల్లో ఉన్నవారికి సాయపడాలని చెప్పారు.
సందర్శించిన మంత్రి, అధికారులు
రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్‌రాణా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇస్తెమా ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకు ముందు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఇస్తెమా ప్రశాంతంగా జరుగుతుందని, పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చారన్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారయంత్రాంగం చర్యలు తీసుకుందని చెప్పారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో పెద్ద ఎత్తున ఇస్తెమా జరగడం సంతోషంగా ఉందన్నారు.
నేడు దువా
ఇస్తెమా ఆఖరి రోజు అయిన గురువారం ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి లక్షలాదిగా ముస్లింలు ఆత్మకూరుకు తరలివచ్చారు. నేడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశ్వశాంతి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సామూహికంగా ముస్లింలు ప్రార్థన (దువా) చేయనున్నారు.
ప్రత్యేక ప్రార్థన చేస్తున్న ముస్లింలు
తోటి వారి పట్ల శాంతి, కరుణ,
ప్రేమ చూపాలి
నిత్యం అల్లా ఆరాధనలో గడపాలి
ఆత్మకూరు ఇస్తెమాలో
మౌల్వీల పిలుపు
ప్రత్యేక ప్రార్థనలకు లక్షలాదిగా
తరలివచ్చిన ముస్లింలు
సందర్శించిన మంత్రి ఫరూక్,
ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment