నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
నంద్యాల: పట్టణంలోని కలెక్టరేట్ సెంటీనరి హాల్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఫిర్యాదుల స్వీకరణకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, నియోజకవర్గ, మండల స్థాయిల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
శ్రీశైలం నుంచి 8,908 క్యూసెక్కుల నీరు విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయం ద్వారా శనివారం నుంచి ఆదివారం వరకు 8,908 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాజెక్ట్‌లకు వదిలారు.నాగార్జునసాగర్‌కు 2,918 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 , హంద్రీనీవా సుజల స్రవంతికి 1,600, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 490, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 1,500 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.511 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రం సమయానికి జలాశయంలో 108.2292 టిఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 860.70 అడుగులకు చేరుకుంది.
బెలుం గుహలను తిలకించిన ఎస్పీ
కొలిమిగుండ్ల: భూమి అంతర్భాగంలో అవతరించి పర్యాటకులను ఆకట్టుకుంటున్న బెలుం గుహలను ఆదివారం జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా కుటుంబ సభ్యులతో కలిసి తిలకించారు. గుహల ఆవరణానికి చేరుకోగానే గుహల సిబ్బంది స్వాగతం పలికారు. గుహ లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన పలు ప్రదేశాలను కలియతిరిగి ఆసక్తిగా తిలకించారు. ఈ గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి..వాటి ప్రాముఖ్యత ఏమిటని అడిగి తెలుసుకున్నారు.
ఏప్రిల్ 1న కేంద్రీయ విద్యాలయం ప్రారంభం
డోన్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఈమేరకు కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డోన్‌లోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో విద్యార్థుల వసతి కోసం నిర్మించిన అత్యాధునిక భవనంలో ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది ఈ భవనాన్ని కేంద్ర మానవ వనరుల శాఖకు చెందిన అధికారుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అత్యంత అనువైనదిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
నయా మోసం
గడివేముల: సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. సెకన్ల వ్యవధిలో ప్రజల డబ్బును దోచుకునేందుకు ఏమార్చుతున్నారు. తాజాగా యూపీఏ యూజర్లే లక్ష్యంగా జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు పాల్పడుతున్నారు. మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన పరమేష్ గౌడ్ అకౌంట్‌కు రూ.3.24 లక్షలు జమ అయినట్లు ఆదివారం ఫోన్‌కు మేసేజ్ వచ్చింది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అదే మొత్తం కనిపించింది. అయితే ఆ అమౌంట్‌ను ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేస్తుంటే పోవడం లేదు. అనుమానంతో ఆన్‌లైన్‌లో చూస్తే తన అకౌంట్‌లో జీరో కనిపిస్తోంది. ఉండాల్సిన రూ.1,600 కూడా లేదు. ఎవరైనా తన అకౌంట్‌కు నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే క్షణాల్లో మాయమవుతోంది. తన అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని పసిగట్టి అకౌంట్‌కు ఎవరూ డబ్బులు పంపకుండా జాగ్రత్త పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment