కన్నీటి దిగుబడి!
● మినుము రైతుల ఆశలు అడియాసలు
● జిల్లాలో 45 వేల ఎకరాల్లో సాగు
● వెంటాడిన చీడపీడలు
● పూత దశలో అకాల వర్షం
● ఎకరాకు రూ. 30 వేల పెట్టుబడి
● 5 క్వింటాళ్లలోపే దిగుబడులు
● లబోదిబోమంటున్న రైతులు
కోవెలకుంట్ల: ఈ ఏడాది రబీసీజన్ రైతులకు కలిసిరాలేదు. సీజన్‌లో సాగు చేసిన వివిధ పంటలకు వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు దిగుబడులపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది విస్తారంగా సాగైన పప్పుశనగలో తుఫాన్ ప్రభావంతో పూత, పిందె రాలిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సాగైన మినుము పంట చేతికందటంతో కోత, నూర్పిడి పనుల్లో రైతులు బిజీ అయ్యారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 69,842 ఎకరాల్లో మినుము సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా ప్రాంతాల్లో వర్షాధారం, సాగునీటి వనరుల ఆధారంగా 44,958 ఎకరాల్లో ఈ పంట వేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్‌లోని కోవెలకుంట్ల మండలంలో 1,300 ఎకరాల్లో, సంజామల మండలంలో 1,162 ఎకరాల్లో, దొర్నిపాడు మండలంలో 603 ఎకరాల్లో, అవుకు మండలంలో 465 ఎకరాల్లో, ఉయ్యాలవాడ మండలంలో 413 ఎకరాల్లో, కొలిమిగుండ్ల మండలంలో 267 ఎకరాల్లో సాగైంది.
వెంటాడిన తెగుళ్లు
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో విత్తనానికి ముందు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. దాదాపు 70 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులతో సాగు 45 వేల ఎకరాలకు పరిమితమైంది. 90 రోజుల పంట కాలం కలిగిన మినుములో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలు వెచ్చించారు. కౌలు రైతులపై కౌలు రూపంలో అదనంగా మరో రూ. 10 వేలు భారం పడింది. పైరు పూత దశలో ఉండగా తుఫాన్ ప్రభావంతో మోస్తరు వర్షాలు కురవడంతో పూత రాలిపోయింది. వర్షానికి తోడు రసం పీల్చుపురుగు, కాండం తొలుచు, పూతలో పురుగుతో పాటు బూడిద, బొంత తెగుళ్లు ఆశించాయి. ఈ తెగుళ్ల బారి నుంచి పైరును కాపాడు కునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. అయినా, పూత రాలిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే నాలుగున్నర క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, తెగుళ్లే కొంప ముంచాయని వారు వాపోతున్నారు.
గతేడాది ఆశించినస్థాయిలో దిగుబడులు
జిల్లాలో గతేడాది రబీ సీజన్‌లో 48 వేల ఎకరాల్లో రైతులు మినుము పంట సాగు చేశారు. విత్తనానికి ముందు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతోపాటు పైరు వివిధ దశల్లో వాతావరణం అనుకూలంగా మారటంతో మంచి దిగుబడులొచ్చాయి. ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడుల రూపంలో వెచ్చించగా ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడులు లభించాయి. గత ప్రభుత్వం విత్తనానికి ముందే క్వింటా రూ. 8 వేలు మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉండటంతో రైతులు కల్లాల్లోనే పంటను విక్రయించి లాభాలు గడించారు. ఈ ఏడాది కోటి ఆశలతో మినుము సాగు చేయగా ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీయడంతో దిగుబడులు తగ్గి నష్టాల ఊబిలో కూరుకుపోయారు. మినుము సాగుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
ఈ ఏడాది మినుముసాగుతో దిగుబడులు తగ్గిపోయాయి. నాకున్న ఎనిమిది ఎకరాల్లో మినుము పంట సాగు చేశాను. గత ఏడాది ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది చీడపీడలతో ఐదు క్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా రూ. 7 వేల నుంచి రూ. 8 వేలలోపు ఉంది. క్వింటాకు రూ. 10 వేలు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు నష్టాల బారి నుంచి కాస్త బయటపడతారు.
– రామయ్య, రైతు, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment