పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి
నంద్యాల: ఇంటితో పాటు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్‌లో భాగంగా కలెక్టర్ నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా కలియతిరిగి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్‌ను జిల్లా వ్యాప్తంగా అన్ని నివాసిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, బస్ స్టాపులు, రైల్వేస్టేషన్లు, పరిశ్రమలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచి 12 నెలల పాటు నెలకు ఒక ఽథీమ్‌తో స్వచ్ఛత కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి మాసానికి సంబంధించి న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ థీమ్‌తో కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. పట్టణాల్లో పెద్ద పెద్ద గార్బేజ్ పాయింట్లను తొలగించి వాటి స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా విభజించి తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేసి సంపద సృష్టించే కార్యక్రమం చేపడతామని చెప్పారు. ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దుకాణదారులతో మాట్లాడుతూ వేస్ట్ మెటీరియల్‌ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీల్లో వేసేందుకు పెద్దపెద్ద చెత్తకుండీలను ఏర్పాటు చేసి సైన్ బోర్డులు ప్రదర్శించాలన్నారు. కలెక్టర్ వెంట స్వచ్ఛత కార్యక్రమంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ రజియా సుల్తానా, డిపో మేనేజర్ గంగాధర్, వార్డు కౌన్సిలర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నంద్యాల మున్సిపల్ కార్యాలయము నుంచి మున్సిపల్ టౌన్‌హాల్ వరకు నిర్వహించిన స్వచ్ఛత భారీ ర్యాలీని కలెక్టర్ రాజకుమారితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మునిసిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్న సమయంలో కలెక్టరేట్ ముఖ ద్వారం నుంచి పీజీఆర్‌ఎస్ సెంటినరీ హాల్, కలెక్టర్ కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్‌లో
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment