డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ జావళి
బొమ్మలసత్రం: నంద్యాల సబ్‌డివిజన్ పోలీస్ అధికారిణిగా ఐపీఎస్ మందా జావళి ఆల్ఫోన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు సెలెక్ట్ అయ్యానన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణకు కృషి చేస్తానన్నారు. అలాగే మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు వెల్లడించారు.
గడ్డిమైదానాల పర్యవేక్షణకు ప్రత్యేక శిక్షణ
ఆత్మకూరు రూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో గడ్డి మైదానాల పర్యవేక్షణకు నంద్యాల సర్కిల్ పరిధిలో ప్రత్యేక శిక్షణ ప్రారంభమైంది. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్‌లో ప్రాజెక్ట్ టైగర్ ఆత్మకూరు డీడీ సాయిబాబా ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. గ్రాస్‌మాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన డాక్టర్ ముర్తుకర్ నల్లమలలోని గడ్డి మైదానాలపై అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈశిక్షణ కార్యక్రమాలు రూపొందించారు. భూమి స్థితి, రంగును బట్టి గడ్డి జాతుల ఎంపిక, సంవత్సర కాలవ్యవధి గల జాతుల ఎంపిక ,వన్యప్రాణులకు మేయడానికి అక్కరకు రాని కలుపు మొక్కల తొలగింపు, గడ్డి విత్తనాల సేకరణ తదితర అంశాలపై సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో నంద్యాల డీడీఅనురాగ్ మీన , శ్రీశైలం సబ్ – డీఎఫ్‌ఓ అబ్దుల్ రౌఫ్, ఎఫ్‌ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌ఓలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
‘ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్’ని సద్వినియోగం చేసుకోండి
నంద్యాల: జిల్లావ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్ షిప్ పథకాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతీ యువకులు ఈనెల 21వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పోర్టల్ https://pminternship.mca. gov.in/login/ లాగిన్ అయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ స్కీంలో ఎంపికై న అభ్యర్థులకు దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశాలు కల్పిస్తారన్నారు. వన్‌టైం గ్రాంట్ కింద రూ.6వేలతో పాటు ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ కూడా చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సీహెచ్‌ఎస్‌సీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీఫార్మసీ తదితర గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉన్న వారు అర్హులన్నారు. వివరాలకు 6300324076, 8297812530 నంబర్లను సంప్రదించాలన్నారు.
పనితీరు మార్చుకోకపోతే తొలగిస్తాం
● ఉపాధి సిబ్బందికి డ్వామా పీడీ హెచ్చరిక
చాగలమర్రి: పనితీరు మార్చుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని డ్వామా పీడీ జనార్దన్‌రావు ఉపాధి సిబ్బందిని హెచ్చరించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఏపీఓ నిర్మల, టెక్నికల్ అసిస్టెంట్లు బాలు నాయక్, రవి, మద్దిలేటి, నరసింహరెడ్డిల పనితీరును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఈ ఏడాది కూలీలకు 2.85 లక్షల పని దినాలు కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.65 లక్షల పని దినాలు మాత్రమే కల్పించారని, గోకులం షేడ్లు 20 మంజూరైతే వాటిలో 10 మాత్రమే పూర్తి చేశారని మండిపడ్డారు. ఇలా ప్రతి విషయంలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్కడికక్కడే నోటీసులు జారీ చేశారు. మూడురోజుల్లో సమాధానం చెప్పి, పనితీరు మార్చుకోకపోతే తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, ఏపీడీ సాంబశివారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment