ఆరిపోయిన ఆశల దీపాలు
కోసిగి: ఎర్రనాలవాగులో నీళ్లుతాగేందుకు వెళ్లి కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన కురువ పెద్దనరసింహులు, పద్మావతి కుమార్తె నరసమ్మ(12), చిన్న కుమారుడు రఘువరన్(10) మృతిచెందారు. ఈ దుర్ఘటన సోమవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు దేవేంద్ర కోసిగిలో మౌంట్ కార్మెల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె నరసమ్మ ఎమ్మిగనూరు బాలికల హాస్టల్‌లో ఉంటూ 7వ తరగతి చదువుతోంది. చిన్న కుమారుడు రఘువరన్ గ్రామంలో ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు.ఆ కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఉంది. పొలంలో మొక్కజొన్నను సాగుచేసుకున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తికావడంతో సోమవారం పెద్ద కుమారుడు దేవేంద్ర పాఠశాలకు వెళ్లాడు. కుమార్తెను హాస్టల్‌లో వదిలేసి వచ్చేందుకు తండ్రి నరసింహులు వార్డెన్‌కు ఫోన్ చేశాడు. మొదటి రోజు పిల్లలు రాలేదని, రెండు రోజులు ఆగి రమ్మని వార్డెన్ చెప్పారు. తల్లి పద్మావతి ఇతర పొలాలకు కూలీ పనులకు వెళ్లగా.. తండ్రి నరసింహులు పెంచుకుంటున్న గొర్రెలను తీసుకుని పొలానికెళ్లాడు. తండ్రితో పాటు అక్కాతమ్ముడు నరసమ్మ, రఘువరన్ కలిసి వెళ్లారు. గ్రామం నుంచి సాతనూరు కొట్టాల గ్రామానికి వెళ్లే దారిలో ఎర్రనాల వంక ఉండగా.. ఎర్రమట్టి కోసం అక్రమార్కులు దానిని తవ్వడంతో లోతట్టు ఏర్పడింది. ఆ వంకలో ఆరు అడుగుల మేర లోతులో నీళ్లు నిలిచి ఉండగా గొర్రెలకు తాపేందుకు ముగ్గురు చిన్నారులు వెళ్లారు. గొర్రెలకు నీళ్లు తాగించి బయటకు వదిలేసి.. రఘువరన్ దప్పిక తీర్చుకునేందుకు వంకలో కొద్ది దూరం లోతుకు వెళ్లి మునిగిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు నరసమ్మ ప్రయత్నం చేస్తూ మునిగిపోయింది. ఒడ్డున ఉన్న వాళ్ల చిన్నాన్న కుమారుడు వంశీ అరుపులు వేయడంతో చుట్టు పక్కల పొలాల రైతులు, గ్రామస్తులు వచ్చి వంకలో దూకి పిల్లలను బయటకు తీశారు. అప్పటికే నరసమ్మ, రఘువరన్ మృతి చెందారు. పిల్లలు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రమోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎర్రనాలవాగులో పడి
అక్కాతమ్ముడు మృతి
శోకసంద్రంలో తల్లిదండ్రులు
జంపాపురంలో విషాద ఛాయలు
వారి ఆశలన్నీ కుమార్తె, కుమారుడిపైనే
మంచి చదువులు చెప్పించాలనేది లక్ష్యం
ఎంత కష్టాన్ని అయినా ఓర్చుకునే సహనం
తమ పిల్లల గురించి చెబుతూ మురిసిపోయేవారు
అయితే విధి పగబట్టింది..
ఎర్రనాలవాగు రూపంలో వారి ఆశలను ఆర్పేసింది
ఎర్రమట్టి కోసం అక్రమార్కులు చేసిన లోతట్టు
ఇద్దరు పిల్లలను మింగేసింది
జంపాపురంలో విషాదం అలుముకుంది
Comments
Please login to add a commentAdd a comment