ఉపాధి పనుల్లో తగ్గిన హాజరు
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తయినా ఉపాధిహామీ పనుల్లో కూలీల సంఖ్య పెరగడం లేదు. జిల్లా నీటియాజమాన్య సంస్థ అధికారులు పూర్తి స్థాయిలో పనులు పెట్టకపోవడంతోనే లేబర్ రిపోర్టింగ్ అతి తక్కువగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోజుకు 1.15 లక్షల మంది వరకు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీ ఉపాధి పనులకు హాజరైన కూలీల సంఖ్య 62,834 మాత్రమే. కర్నూలు జిల్లాలో 42,018, నంద్యాల జిల్లాలో 20,816 మంది మాత్రమే హాజరైనట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా బోగస్ హాజరు ఉందనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సగానికిపైగా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు లేకపోవడం గమనార్హం. పశ్చిమ ప్రాంతంలో రెండు నెలల క్రితమే పంటల సీజన్ పూర్తయింది. అక్కడ వెంటనే ఉపాధి పనులు చేపట్టకపోవడంతో జిల్లా నుంచి వలసలు పెరిగాయి. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సంక్రాంతి పండగ కోసం తిరిగి వచ్చారు. పండుగ ముగియడమే తరువాయి మళ్లీ వలసలు ఊపందుకున్నాయి. నంద్యాల జిల్లాలోని ప్యాపిలి, బేతంచెర్ల, డోన్, కొలిమిగుండ్ల తదితర మండలాల నుంచి వ్యవసాయ కూలీలు, రైతులు పెద్ద సంఖ్యలో వలస పోతున్నారు.
గత ఏడాది ఇదే సమయంలో
95 వేల మంది కూలీలు హాజరు
నేడు 42 వేల మందికే పరిమితం
సగానికిపైగా పంచాయతీల్లో
కానరాని పనులు
Comments
Please login to add a commentAdd a comment