నష్టమే మిగిలింది
విత్తనాలు లభించకపోయినప్పటికీ బ్లాక్‌లో కొని కంది సాగు చేశాం. ఆరుసార్లు పురుగుమందులు పిచికారీ చేయగా రూ.12 వేల వరకు ఖర్చు వచ్చింది. పంట పూత దశలో ఉన్న సమయంలో వర్షాలు రావడంతో రాలి పోయింది. ఆరేడు క్వింటాళ్ల పంట వస్తుందని అనుకున్నాం. కాని మూడున్నర క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.23 వేలు కూడా రాలేదు. మాకు నష్టమే మిగిలింది.
– రామచంద్రుడు, బాపలదొడ్డి,
కృష్ణగిరి మండలం, కర్నూలు జిల్లా
ఖర్చులు పెరిగాయి..
ఈసారి కంది విత్తనం కొనుగోలు నుంచి కోత వరకు కంది సాగు ఖర్చులు పెరిగాయి. పెరిగిన పెట్టుబడికి తగ్గట్టు పంట పండటం లేదు. దిగుబడులు అంతంత మాత్రమే వస్తున్నాయి. తీరా వచ్చిన పంటకు ధర పతనం కావడంతో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
– యరభం హరి సర్వోత్తమరెడ్డి ,
మిడుతూరు
తుఫానులు దెబ్బతీశాయి
మేం 20 ఎకరాల్లో కంది సాగు చేశాం. పంట బాగా పెరిగి పూత భారీగా వచ్చింది. ఎనిమిది దఫాలుగా పురుగు మందులు పిచికారీ చేశాం. ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టాం. ఎకరాకు కనీసం నాలుగు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించాం. తుఫానుల బెడద ఎక్కువగా ఉండటంతో పూత, పిందె రాలిపోయి ఎకరాకు రెండు క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదు. ఎకరాకు రూ.6 వేలు నష్టం వస్తోంది.
– ఆదినారాయణ, వెంకటాపురం,
డోన్ మండలం, నంద్యాల జిల్లా
ప్రభుత్వం అనుమతి ఇస్తేనే..
మద్దతు ధరతో కందులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మండలానికి ఒక్కటి ప్రకారం 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. కందిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతుసేవా కేంద్రాల్లో 1,200 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. – రాజు, జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment