పోలీసుల వేట
సాక్షి, నంద్యాల: సినిమా షూటింగ్‌ను తలపించే సన్నివేశాలు.. పొలాలు, వాగులు వెంట పోలీసుల పరుగులు.. వారికి సహాయంగా విల్లంబులు చేత పట్టిన చెంచులు.. గంటగంటకు ఉత్కంఠ.. చూస్తున్న వారికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. చివరకు దొంగల కోసం పోలీసులు సాగించిన వేట అని తేలింది. ఇటీవల పాణ్యం, నంద్యాల ప్రాంతాల్లో రెండు దారి దోపిడీ ఘటనలు జరిగాయి. ఈ కేసుల దర్యాప్తు సాగిస్తున్న పోలీసులకు కీలక సమాచారం అందింది. గడివేముల మండలం కరిమద్దెల – పరమటూరు గ్రామాల మధ్య ఓ వాగు వద్ద దారి దోపిడీ దొంగ లు స్థావరం ఏర్పాటు చేసుకున్నారని పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం సీఐలు కిరణ్‌కమార్ రెడ్డి, సురేష్, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం, గడివేముల పోలీసులు, క్రైమ్ పార్టీ సిబ్బంది రంగంలోకి దిగారు. సాయంత్రం డ్రోన్‌తో పోలీసులు గాలిస్తుండగా ఓ ప్రాంతంలో దొంగల స్థావరం కనిపించింది. అక్కడికి సమీపిస్తుండగా వారిపై ఇద్దరు దుండగులు ఆయుధాల తో దాడికి యత్నిస్తూ పరారయ్యారు. కాగా ముందస్తు ఆలోచనతో సహాయంగా పోలీసులు వెంట తీసుకెళ్లిన చెంచులు విల్లంబులతో దాడి చేయగా ఓ దుండగుడికి బాణం గుచ్చుకున్నట్లు తెలిసింది. దొంగల స్థావరంలో పదునైన ఆయుధాలు, మద్యం, రెండు బ్యాగులు, ఐదు సెల్‌ఫోన్లు, సోలార్ లైట్లు లభించినట్లు సమాచారం. కాగా ఇద్దరు దొంగలు సమీపంలోని మొక్క జొన్న పొలంలో నక్కినట్లు తెలుసుకున్న పోలీసులు వారి కోసం పొలం నలువైపులా చుట్టుముట్టి గాలిస్తున్నారు. రాత్రి కావడంతో 30 మంది సిబ్బంది లైటింగ్ సహాయంతో నిఘా పెట్టారు. కాగా దొంగలకు సహాయకుడిగా ఉన్న కరిమద్దెలకు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దారి దోపిడీ దొంగల
స్థావరంపై దాడి
తప్పించుకున్న ఇద్దరు వ్యక్తులు
చెంచుల బాణం తగిలి
ఒకరికి గాయం
మొక్కజొన్న పొలంలో నక్కిన దొంగలు
రాత్రి వేళ ప్రత్యేక బృందాలతో
గాలింపు
Comments
Please login to add a commentAdd a comment