నేటినుంచి నామినేషన్ల పర్వం | Sakshi
Sakshi News home page

నేటినుంచి నామినేషన్ల పర్వం

Published Thu, Apr 18 2024 9:35 AM

- - Sakshi

పాలమూరు/మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌/జడ్చర్ల: పార్లమెంట్‌ ఎన్నికల పర్వంలో మొదటి అంకం నామినేషన్ల ప్రక్రియ గురువారం మొదలు కానుంది. 25 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్లు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రాల్లో ఎన్నికల అధికారులైన కలెక్టర్లు నామినేషన్‌ పత్రాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం కలెక్టర్‌ చాంబర్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్ణీత వేళల్లో పోటీదారుల నుంచి నామినేషన్‌ పత్రాలతో పాటు అఫిడవిట్లను స్వీకరించనున్నారు. సెలవు దినమైన ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ నేపథ్యంలో మంచి ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేయాలని, నామినేషన్ల దాఖలు రోజు జన సమీకరణ, ర్యాలీలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సీఎం రాకకు జడ్చర్లలో ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జడ్చర్లకు హెలీకాప్టర్‌లో వస్తారని అధికారులు తెలిపారు. సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో స్టేడియం మైదానంలో హెలీప్యాడ్‌ను పరిశీలించారు. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్‌ వరకు కాంగ్రెస్‌ భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం వంశీచంద్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

అరుణ నామినేషన్‌కు హాజరుకానున్న లక్ష్మణ్‌

బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ గురువారం ఉదయం 11.15గంటలకు మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 8గంటలకు కాటన్‌ మిల్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌ వరకు యువ మోర్చా ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ గార్డెన్‌కు చేరుకుని అక్కడి నుంచి క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత క్లాక్‌టవర్‌లో నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ బీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు. నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బీజేపీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు.

పకడ్బందీగా చేపడతాం: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వాన్ని పకడ్బందీగా చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జి.రవినాయక్‌ అన్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ఆయా జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బదులిస్తూ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థులతో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఈపాటికే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటరు స్లిప్పులు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ముహూర్త బలం చూసుకుంటున్న అభ్యర్థులు

తొలి రోజే నామినేషన్‌ దాఖలు చేయనున్న డీకే అరుణ

రేపు కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ కూడా.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

25 వరకు గడువు, 26న పరిశీలన.. 29న ఉపసంహరణకు అవకాశం

Advertisement
Advertisement