రైతులకు ఇబ్బందులుకలగకుండా చూడాలి
నారాయణపేట: మార్కెట్‌కు ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బెన్ షేలం అధికారులకు సూచించారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎన్ని టార్పాలిన్ కవర్లు అందజేశారని, ప్యాడీ క్లినర్స్ తదితర వాటిపై మార్కెట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని అడిగారు. మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, కార్యదర్శి భారతి తదితరులు ఉన్నారు.
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. లోన్ యాప్స్ ద్వారా అప్పు తీసుకుంటే ప్రాణాలకు ముప్పు వస్తుందని.. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావొద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుటుంబ సర్వేను అసరా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌నంబర్‌కు ఓటిపి వచ్చిందని మాకు చెప్తే మీకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, మోసపూరితమైన మాటలు నమ్మవద్దని, ఎలాంటి ఓటీపీలను ఆధార్ నెంబర్లను గుర్తు తెలియని వ్యక్తులు అడిగిన చెప్పవద్దని తెలిపారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టాలని ఎవరో చెప్పింది విని, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోరాదని, ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తే నమ్మవద్దని సూచించారు. లోన్‌యాప్స్ వేధింపులకు మీలో మీరే బాధపడవద్దు, క్షణికావేశాలకు పోవద్దని, కుటుంబ సబ్యులకు, స్నేహితులకు చెప్పాలని, 1930 కి లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి తోటి వారిని సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.
జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం
మక్తల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్ రాష్ట్రంలో గురువారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 71 కేజీల విభాగంలో మక్తల్‌కు చెందిన వడ్ల జాహ్నవి సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటినట్లు కోచ్ సంపత్‌కుమార్ విలేకర్ల తెలిపారు. హైదరాబాద్ హకీంపెట స్పోర్ట్స్ స్కూల్‌లో చదువుతున్న జాహ్నవి వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతుంది. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చి రజత పతకం సాధించి సత్తా చాటిందని తెలిపారు. ఈ విషయం తెలియడంతో జాహ్నవి కుటుంబసభ్యులకు బంధువులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
యాదాద్రి తరహాలో ఘాట్ రోడ్డు నిర్మాణం
చిన్నచింతకుంట: యాదాద్రి తరహాలో కురుమూర్తిస్వామి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతామని ఆర్‌అండ్‌బీ ఈఎంసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మోహన్‌నాయక్ అన్నారు. గురువారం ఆయన కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేసిందన్నారు. యాద్రాది తరహాలో కురుమూర్తి ఆలయం వద్ద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. టెండర్ల పక్రియ పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటయ్య, అధికారి సంధ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment