‘స్వచ్ఛత’కు.. మరో చాన్స్
నర్వ: సంపూర్ణ పారిశుద్ధ్యమే లక్ష్యంగా.. స్వచ్ఛభారత్ నినాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాయి. ప్రతి కుటుంబానికి వ్యక్తి గత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేలా చేయడానికి స్వచ్ఛభారత్ మిషన్(ఎస్‌బీఎం) కార్యక్రమం నాలుగేళ్ల క్రితం పెద్ద ఎత్తున చేపట్టారు. 90 శాతం మేర జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టడంతో జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. మూడేళ్ల కిందట ఈ పథకం ద్వారా ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు నిలిపివేసింది. అయితే తాజాగా తిరిగి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ 2.0 పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వివాహాలు కావడం, వేల సంఖ్యలో కొత్త ఇంటి నిర్మాణాలు జరగడంతో తిరిగి పథకాన్ని ప్రారంభించినట్లు గ్రామీణాభివృద్ధి అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యదర్శులకు ఈమేరకు అవగాహన కల్పించారు. ప్రజలు నేరుగా లేదా కార్యదర్శి ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
రెండు విడతల్లో రూ.12వేలు..
గతంలో జిల్లా వ్యాప్తంగా 280 గ్రామ పంచాయతీలుండగా దాదాపు 60 శాతంకు పైగా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు శతం శాతం దిశగా జరిగాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు అందించారు. ఇలా జిల్లాలో 66 వేల మరుగుదొడ్లను నిర్మించగా వీరికి రూ.74 కోట్లు బిల్లులు చెల్లించారు. ఇటీవల వచ్చిన ఆదేశాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి సైతం ప్రభుత్వం రెండు విడతల్లో రూ.12 వేలు అందించనుంది. మంజూరైన లబ్ధిదారుడికి మొదటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన స్థలంలో నిల్చోబెట్టి ఉపాధి అధికారులు ఫొటో తీసి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే రూ.6 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత చివరి ఫొటో అప్‌లోడ్ చేస్తే మిగితా డబ్బులు జమఅ వుతాయి. దీని ప్రకారం ఇప్పటికే 3977 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా మండలాల్లో 4 బృందాలు ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వీటిలో 54 మందికి అధికారికంగా మంజూరు అనుమతులు వచ్చాయి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు
గతంలో పంచాయతీల ద్వారా మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేయాల్సి ఉండగా ఈసారి పంచాయతీలతో పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ గురించి తెలిసిన వారు గూగుల్‌లో ట bm.gov.in అనే వెబ్‌సైట్‌లో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఐఏఏఔ డ్యాష్‌బోర్డుపై క్లిక్ చేసి ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. తరువాత బ్యాంకు ఖాతా, ఆధార్, మొబైల్ ఫోన్ నెంబర్, చిరునామా వివరాలు నమో దు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తులను ఎంపీడీఓ పరిశీలించి డీఆర్‌డీఓ లాగిన్‌కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి డీఆర్‌డీఓ మంజూరు ఇస్తారు.
నిర్మించుకోవాలి
గతంలో జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో చేపట్టాం. దీంతో బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా అప్పట్లో ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో మరో మారు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోని మరుగుదొడ్లు నిర్మించుకోవాలి.
– మాలిక్, ఎస్‌బీఎం జిల్లా సమన్వయకర్త
సద్వినియోగం చేసుకోవాలి
స్వచ్ఛభారత్ మిషణ్ గ్రామీణ్ 2.0 కార్యక్రమం ద్వారా వ్యక్తి గత మరుగుదొడ్ల నిర్మాణాలకు మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని కార్యదర్శులు, లేదా ఆన్‌లైన్ ద్వారానైన దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కారణంగా లబ్ధిదారులను గుర్తించి మంజూరు చేస్తాం.
– మొగులప్ప, డీఆర్‌డీఓ నారాయణపేట
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు దరఖాస్తుల స్వీకరణ
స్వచ్ఛభారత్ మిషణ్,
గ్రామీణ్ 2.0 ద్వారా నిర్మాణాలు
జిల్లాలో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటివరకు 3977 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment