వన మహోత్సవం @ 13 లక్షలు
నర్వ: వన మహోత్సవంలో భాగంగా 2024–25 సంవత్సరం మొక్కల పెంపకం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే అన్ని మండలాలకు చేరాయి. ఈ మేరకు వన మహోత్సవానికి మొక్కలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు పనులను ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల పెంప కం కోసం కవర్లల్లో మట్టి నింపడం.. విత్తనాలు విత్త డం.. మొక్కల సంరక్షణ పక్కాగా కొనసాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి జీపీలో నర్సరీ..
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రతి జీపీలో ఒక్కో నర్సరీని ఏర్పాటు చేశారు. ఆయా నర్సరీల్లో 13 లక్షలకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందులో అత్యధికంగా మద్దూరు మండలంలో 2.27 లక్షలు, అత్యల్పంగా కృష్ణాలో 60 వేల మొక్కలను కొత్తగా పెంచాలని నిర్ణయించారు. ఒక్కో నర్సరీలో 55 వేల మొక్కల వరకు పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్వహణ ఇలా..
నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి జీపీలో 55వేల మొక్కలను పెంచేలా నర్సరీలను ఏర్పాటు చేశారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణతో పాటు రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ భూములు, పంట పొలాల గట్లు, గుట్టలు, బంజారు భూముల్లో మొక్కలు నాటేలా సంబంధిత అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా వివిధ జాతుల మొక్కలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో నర్సరీలకు కనీస రహదారి సౌకర్యం, నీటి వసతి, విద్యుత్ కనెక్షన్, నీరు నిల్వ చేసేలా ట్యాంకులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నర్సరీల్లో మట్టి మిశ్రమం తయారీ, బ్యాగుల్లో మట్టి నింపుట, విత్తనాలు విత్తడం, బెడ్‌ల మధ్య నడిచేందుకు సరిపోయేంత స్థలం ఉండేలా చర్యలు తీసుకున్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలను పశువుల బారి నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా కంచెలను ఏర్పాటుచేశారు.
పాత మొక్కల సంరక్షణపై దృష్టి..
గతేడాది జిల్లాలో ఏర్పాటుచేసిన నర్సరీల్లో 9.99 లక్షల మొక్కలు ఉన్నాయి. వీటిలో మరో కవర్‌లోకి మార్చే మొక్కలు 3.21 లక్షలు ఉన్నాయి. మిగిలిన 6.78 లక్షల మొక్కలను పాత కవర్లలోనే ఉంచి.. వచ్చే ఏడాది వన మహోత్సవం నాటికి నాటనున్నారు. పాత, కొత్త మొక్కలతో కలిపి మొత్తం 22.99 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్దేశిత లక్ష్యం మేరకు..
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీల ఏర్పాటు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.కొత్త మొక్కలు నాటడంతో పాటు పాత మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓలను ఆదేశించాం.
– మొగులప్ప, డీఆర్డీఓ
2024–25 సంవత్సరం లక్ష్యం నిర్దేశం
నర్సరీల్లో మొక్కల పెంపకానికి కసరత్తు
ఈనెలాఖరు నాటికి
పనుల పూర్తికి చర్యలు
Comments
Please login to add a commentAdd a comment