పల్లెపోరుకు సన్నద్ధం
కేటాయించిన గుర్తులివే..
సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ పింక్ కలర్‌లో ఉండగా.. నోటాతో పాటు 30 గుర్తులు ముద్రించనున్నారు. 30 కంటే ఎక్కువ మంది పోటీలో ప్రత్యేకంగా మరో బ్యాలెట్ పేపర్ ముద్రించే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం, కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడి పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, టార్చిలైట్, బ్రష్, బ్యాట్స్‌మెన్, పడవ, బిస్కెట్, ఫ్లూట్, చైన్, చెప్పులు, బెలూన్, స్టంప్స్, నోటా గుర్తులు ఉంటాయి.
● వార్డు సభ్యుడికి నోటాతో కలిపి 21 గుర్తులు ఉంటాయి. ఇందులో గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటినా, గరిట, మూత, ఐస్‌క్రీం, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, కవరు, హాకీ కర్రబంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్ స్తంభం, కేటిల్, నోటా గుర్తులుంటాయి. వార్డు సభ్యుడి ఎన్నికకు తెల్లరంగు కాగితంపై గుర్తులు ముద్రించనున్నారు.
నారాయణపేట: గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాదవుతోంది. ప్రత్యేక అధికారులకు పాలనా పగ్గాలు అప్పజెప్పినా అభివృద్ధి మాత్రం ఆశించిన మేర జరగడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతుండటంతో జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా 4,09,090 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 1,412 బ్యాలెట్ బాక్సులు, 2,544 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. ఎన్నికల సిబ్బందికి ప్రవర్తనా నియామవళి, విధులు నిర్వహించే అధికారుల శిక్షణకు సంబంధించిన పుస్తకాలు జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరకున్నాయి. నోడల్ అధికారుల నియామకం, సర్పంచ్, వార్డు సభ్యులకు కేటాయించే గుర్తులను ఖరారు చేశారు. అలాగే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు టెండర్లు కూడా ఖారారయ్యాయి.
మూడు విడతల్లో..?
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కమిషన్‌కు నివేదించింది. ఒక్కో నియోజకవర్గం ఒక విడతలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు జిల్లావ్యాప్తంగా 280 గ్రామపంచాయతీలకుగాను 79 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. నాలుగైదు గ్రామపంచాయతీలకు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటుచేసి (నామినేషన్ కేంద్రం) అక్కడే నామినేషన్ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. పోలింగ్ నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 2,544 పోలింగ్ కేంద్రాలకుగాను 3,025 మంది సిబ్బంది కావాల్సి ఉందని ఉన్నతాధికారులకు నివేదించారు.
మండలాల వారీగా ఓటర్లు వివరాలు
మండలం గ్రా.పం పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు
దామరగిద్ద 30 284 22,151 23034 –
ధన్వాడ 20 182 15,779 16,087 1
కోస్గి/గుండుమాల్ 26 230 17,199 17,991 –
కృష్ణా 13 120 10,571 11,131 –
మద్దూర్/కొత్తపల్లి 39 420 28,395 29,558 1
మాగనూర్ 16 140 9,681 10,059 –
మక్తల్ 39 340 21,383 22,097 –
మరికల్ 17 166 16,290 16,952 –
నారాయణపేట 28 268 23,687 24,665 1
నర్వ 19 174 13,693 14,458 –
ఊట్కూర్ 23 220 21,745 22,481 –
పండుగ తర్వాతే రిజర్వేషన్ల ప్రక్రియ..
2019లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగుతాయని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ మార్క్‌ను చూపించుకునేందుకు రిజర్వేషన్ల మార్పు, బీసీల రిజర్వేషన్ పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. సమగ్ర కుటుంబ సర్వేలో కులగణన చేయడంతో బీసీల్లో మరింత ఆశలు పెరిగాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ల నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని అశావహులు ఎదురుచూస్తున్నారు. రొటేషన్ పద్ధతిలో అయితే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు మారుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
గ్రా.పం : గ్రామపంచాయతీలు
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు.. 79 క్లస్లర్లు
సర్పంచుకు 30,
వార్డు సభ్యులకు 20 గుర్తులు
సంక్రాంతి తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కృష్ణ, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment