రహదారి నిబంధనలపై అవగాహన అవసరం
నారాయణపేట: రహదారి నిబంధనలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి రోడ్ సేఫ్టీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో చర్చించిన అంశాలు, చేపట్టిన పనులపై శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్‌తో సమావేశానికి రావాలని సూచించారు. అనంతరం ఎస్పీ యోగేష్ గౌతమ్ రోడ్డు భద్రతపై పోలీస్ స్టేషన్ల వారీగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలో ఆరు బ్లాక్‌స్పాట్లను గుర్తించామని.. అందులో మాగనూరు మండలం గుడెబల్లూరు, మక్తల్, మరికల్, పెద్దచింతకుంట, అప్పంపల్లి, కోస్గి మండలంలోని నాచారం ఉన్నాయని తెలిపారు. అలాగే ఈ నెల 10న జిల్లాకేంద్రంలో రోడ్డు భద్రతపై అన్ని శాఖల అధికారులు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాలని, 18న మక్తల్‌లో ఆటో, కమర్షియల్ టాక్సీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించేందుకు కలెక్టర్, ఎస్పీ నిర్ణయించారు. అదేరోజు ఆర్టీసీ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్యాధికారి డా. సౌభాగ్యలక్ష్మిని ఆదేశించారు. జిల్లాకేంద్రంతో పాటు మక్తల్, కోస్గి సర్కిళ్ల పరిధిలో సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. వైర్‌లెస్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్టీఓ కార్యాలయం పరంగా అవగాహన కార్యక్రమాలు చేసి వదిలేస్తే ఎలాగని ఆర్టీవో మేఘాగాంధీని ప్రశ్నించారు. ఏదైనా కార్యక్రమం చేసే ముందు సంబంధిత శాఖల అధికారులకు సమాచారమిచ్చి భాగస్వాములను చేయాలన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య రోడ్డు భద్రత మాసోత్సవాల రోజువారీ కార్యక్రమ ప్రణాళికను చదివి వినిపించారు. ఇకపై చేపట్టే కార్యక్రమాలు డీపీఆర్వోకు సమాచారమిచ్చి విస్తృతంగా ప్రచారం చేయాలని డిపో మేనేజర్‌కు సూచించారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఈఓ గోవిందరాజులును ఆదేశించారు. నేషనల్ హైవే అథారిటీ అధికారి శాలిని మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై హైమాస్ట్ లైట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, మక్తల్‌లో రహదారిపై వాహనాలు నిలుపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. మక్తల్ – నారాయణపేట రహదారి మరమ్మతు చేపట్టామని, మాగనూరు రోడ్డుపై గుంతలను పూడ్చుతున్నామని ఆర్‌అండ్‌బీ డీఈ రాములు వివరించారు. పంచాయతీరాజ్ రహదారుల మరమ్మతులు చేస్తున్నామని, కల్వర్టులను నిర్మిస్తున్నామని పీఆర్ ఈఈ హీర్యానాయక్ తెలిపారు. సమావేశంలో సీఐలు శివశంకర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి నెల 2వ శనివారం రోడ్ సేఫ్టీ సమావేశం
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment