పెసర క్వింటా రూ.7,570
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పెసర క్వింటాకు గరిష్టం, కనిష్టంగా రూ.7,590 ధర పలికింది. అలాగే, వేరుశనగ గరిష్టంగా రూ.5,520, కనిష్టంగా రూ.3,319, ఆలసందలు గరిష్టంగా రూ.7,570, కనిష్టంగా రూ.6,839, వడ్లు సోనా గరిష్టంగా రూ. 2,509, కనిష్టంగా రూ.2,429, ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,006, కనిష్టంగా రూ.6,032, తెల్ల కందులు గరిష్టంగా రూ.8,569, కనిష్టంగా రూ.7,550 ధరలు పలికాయి.
సింగోటం లక్ష్మీనృసింహుడి ప్రభోత్సవం
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ప్రభోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి దీక్షహవనం, లక్ష్మీగణపతి హోమతర్పణం, సతీసమేత ఆదిత్యాది నవగ్రహ, ఆంజనేయ, వాస్తు, సర్వతోభద్రహవనాలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై ఉంచి రత్నగిరి కొండ వరకు వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ పౌండర్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్‌రావు, అర్చకులు పాల్గొన్నారు. అనంతరం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనను మంత్రి జూపల్లి కృష్ణారావు తిలకించారు. అలాగే శుక్రవారం జరిగే రథోత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
నవోదయ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు
బిజినేపల్లి: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, పరీక్షలను అధికారులు బాద్యతగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా విద్యా శాఖ అదనపు కమిషనర్ రాజశేఖర్‌రావు అన్నారు. గురువారం బిజినేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రవేశ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 వేల మందికిపైగా విద్యార్థులు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి కో సం ప్రవేశ పరీక్షకు హజరుకానున్నారని, మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 27 మంది సూపరింటెండెంట్లు, 27 మంది పరీశీలకులను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆయా జిల్లాల పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపల్ జానకిరాములు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment