హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ వద్ద పెద్ద సంఖ్యలో చేరిన భక్తులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు కోవిడ్–19 ప్రొటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించాలన్న నిబంధనలు కొనసాగుతున్నాయి. సంక్రమణ వేగానికి అడ్డుకట్టవేసేందుకు ఎక్కువమంది ఒకే ప్రాంతంలో గుమికూడరాదని చెబుతున్నప్పటికీ, దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళాలోని పరిస్థితులు భయపెడుతున్నాయి.
లక్షలాది మంది ఒకే దగ్గర చేరడంతో కుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారుతుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అధికార యంత్రాంగం అంచనాల ప్రకారం ప్రస్తుతం హరిద్వార్ కుంభమేళా ప్రాంతంలో సుమారు 1.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. జనవరి 14న ప్రారంభమైన మహా కుంభ్‌మేళాలో ఇప్పటివరకు 2 షాహీ స్నానాలు జరిగాయి. మార్చి 11న మహా శివరాత్రి సందర్భంగా ఒకటి, సోమ్‌వతి అమావాస్య సందర్భంగా ఏప్రిల్ 12న మరో షాహీ స్నానాలు జరిగాయి.
సాధారణ రోజుల్లో కనీసం 2 నుంచి 5 లక్షల మధ్య ఉండే భక్తుల సంఖ్య షాహీ స్నానాల సందర్భంగా కనీసం 25 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. తాజాగా సోమ్‌వతి అమావాస్య సందర్భంగా ఏప్రిల్ 12న జరిగిన షాహీ స్నానాల్లో సుమారు 31 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు తెలిపారు. నేడు హరిద్వార్ మహా కుంభ్‌మేళాలో బైశాఖి షాహీ స్నానాలు జరుగుతున్నాయి. దీనికి కనీసం 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా కుంభ్‌మేళాలో సామాజిక దూరా న్ని పాటించేలా చేయడంతో పాటు మాస్క్‌లు ధరించని వారికి జరిమానాల వంటి కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించడం కష్టమవుతోందని అధికార యంత్రాంగం భావిస్తోంది. అదే షాహీ స్నానాల సమయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడం అనేది దాదాపు నామమాత్రంగా ఉంటుంది. దీంతో ఇలాంటి ప్రదేశాల్లో కరోనా సంక్రమణ చాలా వేగంగా ఉండడంతో పాటు, ఇలాంటి రద్దీగా ఉండే కార్యక్రమాలు సూపర్ స్ప్రెడర్స్‌గా మారుతాయని అంచనా వేస్తున్నారు. లక్షలమంది ఒకే దగ్గర ఉన్నప్పుడు ప్రోటోకాల్స్ అనుసరించడం సాధ్యమయ్యే విషయంకాదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు.
ఏప్రిల్ 11 న కుంభమేళాకు వచ్చే 53,000 మందికి కరోనా పరీక్ష జరుగగా, కేవలం 1.5 శాతం మాత్రమే పాజిటివ్‌గా ఉన్నారని అధికారులు తెలిపారు. మాస్క్‌లు ధరించడం, సామా జిక దూరం పాటించడం వంటి ఇతర నిబంధనలు కూడా తప్పనిసరి చేసినప్పటికీ మేళా ప్రాంతంలో చాలా మంది వీటిని ఉల్లంఘిస్తు న్నారు. 600 హెక్టార్లలో విస్తరించి ఉన్న మేళా ప్రాంతంపై నిఘా ఉంచడానికి 20,000 మందికి పైగా పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని నియమించారు.
అయినప్పటికీ కోవిడ్ –19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఊహించిన దానికంటే 50 శాతం తక్కువమంది భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు కుంభమేళాలో భారీగా ఒకే ప్రాంతంలో గుమిగూడిన జనాల అనేక ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. గత ఏడాది మార్చి 10 నుంచి 12 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మార్కజ్‌లో 2వేల మంది పాల్గొన్న జమాత్ కార్యక్రమాన్ని సూపర్ స్ప్రెడర్‌గా పెద్ద ఎత్తున హంగామా చేసినప్పుడు, లక్షలమంది ప్రజలు ఒకే దగ్గర గుమిగూడిన మహా కుంభ్‌మేళాను ఏరకంగా చూడాలనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment