25 వరకు నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

25 వరకు నామినేషన్ల స్వీకరణ

Published Fri, Apr 19 2024 1:35 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌  - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైనందున గురువారం నుంచి నామినేషన్లు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వా న్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్‌, అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌తో కలిసి గురువారం మాట్లాడారు. ఆది లాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికకు నేటి నుంచి ఏప్రిల్‌ 25 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపా రు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్‌ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. మే 13 న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటాయని చెప్పా రు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని (కలెక్టర్‌ ) ఛాంబర్‌లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. సెలవు దినాలు మినహాయించి, మిగతా పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, అవలంబించాల్సిన విధానాల గురించి కలెక్టర్‌ వివరించారు.

జిల్లాలో 7.36 లక్షల ఓటర్లు..

నిర్మల్‌ జిల్లాలో 7,36,642 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో పురుషులు 3,54,925 మంది, మహిళలు 3,81,667 మంది, ఇతరులు 50 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను ఈనెల 25 వరకు పరిశీలించి అర్హుల పేర్లు జాబితాలో చేరుస్తామని వివరించారు. నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 667 ప్రాంతాల్లో మొత్తం 925 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటువేసే అవకాశం ఉందని తెలిపారు. మే 8వ తేదీలోపు ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు. స్వీప్‌ ఆధ్వర్యంలో ఓటర్లకు ఓటింగ్‌పై అవగాహన కల్పించడానికి ఓటింగ్‌ శాతం పెంచడానికి మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచారానికి, ప్రకటనలకు అనుమతులు పొందాలన్నారు. సువిధ పోర్టల్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సభలు సమావేశాలకు, ఇతరత్రా అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు..

భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌పాటిల్‌ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీసుశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే సీఆర్పీఎఫ్‌ బలగాలు రూట్‌ మార్చ్‌లు ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయన్నారు. మరో రెండు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.1,90,09,610 నగదు సీజ్‌ చేశామన్నారు. దీనికి సంబంధించి 72 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 298 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 127 కేసులు నమోదు చేశామన్నారు. 289 మందిని బైండోవర్‌ చేసినట్లు వివరించారు. సమావేశంలో డీపీఆర్వో విష్ణువర్ధన్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఆర్డీవో విజయలక్ష్మి, ఈడీఎం నదీమ్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement