లోకేశ్వరం: మండలంలోని దుర్గానగర్ తండాకు చెందిన రాపని లక్ష్మి(32) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన లక్ష్మి, నర్సింలు దంపతులు బండరాళ్లు కొడుతు జీవనం సాగిస్తున్నారు. గురువారం తన తోటి కూలీలతో కలిసి బండరాళ్లు కొట్టడానికి రాయపూర్‌కాండ్లీ శివారు ప్రాంతంలోకి వెళ్లింది. సాయంత్రం ఇంటికి రాగానే నోరు, ముక్కు నుంచి నురగలు రావడంతో కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి దేవరంగుల నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
పిడుగుపాటుతో ఎద్దు మృతి.. ఒకరికి గాయాలు
ఉట్నూర్‌రూరల్: మండలంలోని మారుతినగర్‌లో పిడుగు పాటుతో ఎద్దు మృతి చెందగా ఒకరికి గాయాలయ్యాయి. టేకం రామారావుకు చెందిన ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా మాజీ సర్పంచ్ సిడాం గంగారాంకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ జైవంత్‌రావు సంఘటన స్థలానికి చేరుకొని గంగారాంను 108 ద్వారా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు రెఫర్ చేశారు.
ద్విచక్ర వాహనం చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన దుర్వే రామ్ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం భీంసరి నుంచి వరలక్ష్మినగర్ వైపు వస్తున్న క్రమంలో మార్గమధ్యలో వాహనాన్ని నిలిపి మూత్రవిసర్జనకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. ట్యాంక్ కవర్‌లో మొబైల్ ఫోన్ సైతం ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు టూటౌన్ విష్ణుప్రకాష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
28న జాతీయ క్రీడా దినోత్సవం
ఉట్నూర్‌రూరల్: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 28న ఉట్నూర్‌లో జాతీయ క్రీడాదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం కేబీ కాంప్లెక్స్ ప్రధాన గేటు నుంచి పరుగు ప్రారంభమవుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ఆదర్శ క్రీడా పాఠశాలలకు చెందిన గిరి విద్యార్థులను సత్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment