సంక్షేమ పథకాలు అమలు చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను వందశాతం అమలు చేయాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రగతి పనుల లక్ష్యాలకు సంబంధించి పంచాయతీరాజ్, జాతీయ రహదారుల విభాగం, గ్రామీణాభివృద్ధి, మెప్మా, బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ, జిల్లా పరిషత్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, వ్యవసాయ, విద్య, వైద్యం, ఆరోగ్యం, మహిళా శిశుసంక్షేమం, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జాబ్‌కార్డు కలిగిన ప్రతీ ఉపాధి కూలీకి వందరోజుల పని కల్పించాలని సూచించారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని, సదరం క్యాంపులు నిర్వహించి ధ్రువపత్రాల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా అర్హులైన కుల వృత్తుల వారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నిర్దేశిత ప్రాంతాల్లో వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లు ఏర్పాటు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, పీఎం అమ్మ ఆదర్శ గ్రామ యోజన, అమృత్ పథకంలో మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని ఆదేశించారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు సింగిల్ ఫేజ్ నుంచి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ గ్రామానికి బీటీ రోడ్లు నిర్మించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పనుల పురోగతిలో అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రగతి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రుణమాఫీ కాని అర్హులైన రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కడ్తాల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. సోన్ జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టి వర్షపునీరు సమీప ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలు తున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ డెంగీ, మలేరియా టైఫాయిడ్ బారిన పడిన వారికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. మిషన్ భగీరథ పైపులైన్ మరమ్మతులు చేపట్టి ప్రతీ ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో సాగు భూములకు రహదారి సౌకర్యం కల్పించే పనులు చేపట్టాలని డీఆర్డీవోకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఆర్వో భుజంగ్‌రావు, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ సత్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు విజయలక్ష్మి, గోవింద్, బాబురావు, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, శంకరయ్య, అశోక్‌కుమార్, రాజేందర్, సీఎస్ రావ్, నరసింహరెడ్డి, సుభాష్, సందీప్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
దిశ సమావేశంలో ఎంపీ గోడం నగేశ్
హాజరైన ఎమ్మెల్యేలు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment