నిర్మల్
విధులకు సమాయత్తం
ఆదిలాబాద్ శిక్షణ కేంద్రంలో గురువారం పోలీస్ పాసింగ్ అవుట్‌పరేడ్ నిర్వహించనున్నారు. శిక్షణ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు.
విద్యాశాఖ గాడినపడేనా..!?
● బాధ్యతలు చేపట్టిన కొత్త డీఈవో ● రామారావు ఎదుట సవాళ్లు ఎన్నో.. ● లైవ్ లొకేషన్ అమలు చేస్తారా.. ● సార్లను బడిబాట పట్టిస్తారా.. ● సంఘాల నేతలకు కళ్లెం వేస్తారా..
గురువారం శ్రీ 21 శ్రీ నవంబర్ శ్రీ 2024
8లోu
నిర్మల్: కేవలం.. పదోతరగతి ఫలితాల్లో ఉత్తమం అనిపించుకున్న జిల్లా విద్యాశాఖ గత ఏడాదికాలంలో చాలా విషయాల్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఒక్క యూబిట్ వ్యవహారం చాలు.. జిల్లా విద్యాశాఖలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏస్థాయిలో పేరుకుపోయాయో చెప్పడానికి. పది ఇరవై మంది కాదు.. ఏకంగా వందల్లో ఉపాధ్యాయులు కాసుల కక్కుర్తిలో పడి బడిని, తరగతి గదిని, తమపైనే ఆశలు పెట్టకున్న విద్యార్థులనీ గాలికొదిలేశారు. పాఠాలు చెప్పాల్సిన చోట.. సెల్‌ఫోన్లో ‘కాయిన్’ల లెక్కలు వేసుకున్నారు. చివరకు కొందరు ఊచలను లెక్కపెట్టేదాకా వెళ్లారు. బడి ముఖం చూడకుండా రియల్‌ఎస్టేట్, ఫైనాన్స్ అంటూ తిరిగే సార్లూ చాలానే ఉన్నారు. ఇక కొంతమంది సంఘాల పేర్లు చెప్పుకునే ఉపాధ్యాయుల కథ వేరే ఉంది. ఏకంగా డీఈవోపైనే ఆజమాయిషీ చెలాయించే స్థాయికి వెళ్లిన సందర్భాలు విద్యాశాఖలో లెక్కలేనితనానికి తార్కాణంగా నిలిచాయి. ఇలా దారితప్పిన విద్యాశాఖను కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఈవో రామారావు గాడిన పెడతారా..!? సర్కారు బడిని నమ్ముకున్న విద్యార్థులకు అండగా నిలుస్తారా..!? అని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
కరువైన పర్యవేక్షణ..
ఒకప్పుడు డీఈవో తనిఖీకి వస్తున్నారని తెలియగానే స్కూళ్లన్నీ అలర్ట్ అయ్యేవి. సార్లందరూ విద్యార్థులను ముందుగానే ప్రిపేర్ చేసేవారు. డీఈవోలు కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ బడుల్లో అవసరాలే కాదు.. విద్యార్థుల పఠన నైపుణ్యాలనూ పరీక్షించేవారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచీ ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో చాలామంది ఉపాధ్యాయులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్నా.. కనీసం తమ వృత్తికి న్యాయం చేయని ఉపాధ్యాయులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడైనా డీఈవోగా బాధ్యతలు చేపట్టిన రామారావు గాడిన పెడతారని జిల్లా ఆశిస్తోంది.
ఇష్టారీతిన సంఘాల నేతలు..
పదేళ్లకాలంలో రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా విద్యాశాఖలో పలు సంఘాల పేర్లు చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుపైనా ఆరోపణలు ఉన్నాయి. తమకు, తమవాళ్లకు నచ్చినచోట పోస్టింగ్‌లు, డిప్యూటేషన్‌లను ఇప్పించుకోవడంపైనా ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వాటిపైనా కొత్త డీఈవో దృష్టిపెట్టాల్సిన అవసరమూ ఉంది.
‘ప్రథమం’ నిలుపాలి..
జిల్లా రెండేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలుస్తూ రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతోంది. ఈ ఏడాది కూడా అదేతీరులో ముందుకు సాగాల్సిన అవసరమూ ఉంది. వ్యవస్థలో ఎన్ని ప్రతికూలతలు ఉన్నాయో.. అంతకుమించి ఉత్తములైన ఉపాధ్యాయులూ ఉన్నారు. చాలామంది విద్యార్థుల కోసం పనిచేస్తున్నవాళ్లూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. ప్రత్యేక తరగతులు, పర్యవేక్షణలతో జిల్లా పేరును నిలుపాల్సిన బాధ్యత కూడా కొత్త డీఈఓపైనే ఉంది.
బడిపిల్లలకు న్యాయం చేద్దాం..
జిల్లాలో చదువుకుంటున్న బడిపిల్లలందరి భవిష్యత్తు బాగుండేలా అందరం సమష్టి బాధ్యతతో పనిచేద్దాం. కొత్తగా బాధ్యతలు చేపట్టా. ముందు జిల్లాపై అవగాహన పెంచుకుని, విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తా.
– పి.రామారావు, డీఈవో
‘లైవ్ లొకేషన్’ ఎక్కడా..!?
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయుల హాజరుపై దృష్టి పెడుతోంది. తాజాగా మంగళవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బయోమెట్రిక్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ జిల్లాలో ఎప్పటి నుంచో ఏకంగా లైవ్‌లొకేషన్ విధానం అమలులో ఉంది. నాలుగేళ్ల క్రితమే సర్కారు బడిని గాడిన పెట్టడానికి అప్పటి కలెక్టర్ ముషరఫ్‌అలీ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన కలెక్టర్లు వరుణ్‌రెడ్డి, ఆశిష్‌సంగ్వాన్ దీన్ని కొనసాగించారు. లైవ్‌లొకేషన్ పెట్టకున్నా.. ఇతరులతో పెట్టించినా.. వాళ్లు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో ఉపాధ్యాయుల హాజరు శాతం పెరగడంతో పాటు పక్కాగా బడి వేళలను పాటించారు. కానీ కొంతకాలంగా ‘లైవ్‌వ్ లొకేషన్’ వ్యవస్థనే నీరుగారుస్తూ వస్తున్నారు. గత డీఈవో కూడా దీనిపై సీరియస్‌గా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుత కలెక్టర్ కూడా ఈ విధానంపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ హాజరుకు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే ఉన్న ‘లైవ్‌లొకేషన్’ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్త డీఈవోపైనే ఉంది.
యూబిట్ కేసుల్లో ‘స్టార్లు’..
రాష్ట్రంలోనే సంచలనంగా మారి, ప్రస్తుతం ఈడీ దృష్టిలో ఉన్న యూబిట్ కేసులో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వందల్లో ఉండటం తెలిసిందే. ఇప్పటికీ కొంతమంది ‘స్టార్లు’ తెరవెనుక ఈ దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్లాసురూముల్లోనే ‘కాయిన్’ల దందాలు చేస్తూ.. కళ్లముందున్న పిల్లలకు ద్రోహం చేస్తున్న ఇలాంటి ‘స్టార్ల’నూ గాడిన పెట్టాల్సిన అవసరముంది.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment