ఆర్గానిక్ పత్తి.. విదేశాలకు ఎగుమతి
చెన్నయ్ మీదుగా
జర్మనీకి సరఫరా..
పత్తి పంట చేతికి వచ్చాక పత్తిని తీసే విధానంపై అవగాహన కల్పించడానికి జర్మనీ దేశస్తులు ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తుంటారు. పత్తిని తీశాక ఇంద్రవెల్లి మండలంలో జిన్నింగ్ చేసి అక్కడి నుంచి చెన్నయ్‌కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సదన్ ఫాస్ట్ ఇండియా కంపెనీ నుంచి జర్మనీ దేశానికి తరలిస్తారు. ఈ పత్తితో జర్మనీలో టవల్స్, బెడ్‌షీట్లు తయారు చేసి విక్రయిస్తారు. ప్రతీ సంవత్సరం పత్తి పండించి ఎగుమతి చేస్తుండగా.. ఏటేటా రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ముందుగా 800 మందితో పంట పండించగా.. ప్రస్తుతం ఆ రైతులు సంఖ్య 5,500మందికి చేరింది.
జన్నారం: పత్తి పంట చేతికి రావాలంటే రసాయన ఎరువులు వాడాల్సిందే. మొలక నుంచి మొదలు పత్తి పంట చేతికొచ్చే వరకు చీడపీడల నుంచి రక్షణకు రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి రసాయన మందులు పిచికారీ చేస్తారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల రైతులు పూర్తిగా సేంద్రియ ఎరువులతో పత్తి పండిస్తున్నారు. దిగుబడి వచ్చిన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ రైతులు, జర్మనిలోని డిబెల్ల టెక్స్‌టైల్ కంపెనీ ప్రతినిధులకు మధ్య వారధిగా నిలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి జిల్లాలోని ఆరు మండలాల్లో సుమారు 5,500మందికి పైగా రైతులు ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారని చేత్నా ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్ సంస్థ సీఈవో నందకుమార్ తెలిపారు.
సేవా కార్యక్రమాలు
జర్మనీ, నెదర్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిధులు రైతులతో ఆర్గానిక్ పంట పండించడమే కాకుండా వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థులకు స్కూల్‌బ్యాగులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. సిర్పూర్ మండలంలో కంప్యూటర్ ల్యాబ్, సిర్పూర్–యూ మండలం రాఘవాపూర్‌లో విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు.
జన్నారం మండలంలో ప్రోత్సాహం
రైతులు ముందుకు వస్తే జన్నారం మండలంలో కూడా ఆర్గానిక్ పత్తి పంట పండించేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
ఈ మండలంలోని గిరిజన గ్రామాలను ఎంచుకుని ఆర్గానిక్ పంటపై అవగాహన కల్పించి రైతులు ముందుకు వస్తే వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.
ప్రతియేటా ఉమ్మడి జిల్లా నుంచి తరలింపు
చెన్నయ్ మీదుగా జర్మనీకి.. బట్టలకు వినియోగం
క్వింటాల్‌కు రూ.500 అదనం
అ‘ధనం’
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, కెరమెరి, ఆసిఫాబాద్, సిర్పూర్–యూ, జైనూర్, ఉట్నూర్ మండలాల్లోని 170 గ్రామాల్లో ఆర్గానిక్ పత్తి పంట పండిస్తున్నారు. ఈ ఏడాది ఆయా గ్రామాల్లోని 5,500 మంది రైతులు 7,900 ఎకరాల్లో పత్తి సాగు చేసి 55,300 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఈ పత్తికి మార్కెట్ ధర కన్న పది శాతం ఎక్కువ ధర చెల్లిస్తారు. ఆర్గానిక్ పద్ధతిలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని గ్రహించి ఈ ధర చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,500 ఉండగా.. సంస్థ రూ.8వేలు చెల్లిస్తోంది. దీంతోపాటు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తూ వారికి అవసరమైన సేంద్రియ ఎరువులకు సహకారం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment