మీ పారితోషకాలు మాకొద్దు
● ముక్త కంఠంతో నినదించిన బన్సపల్లి గ్రామస్తులు ● ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం సాయం తిరస్కరణ
దిలావర్‌పూర్: మండల కేంద్రమైన దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ వద్దంటూ నిత్యం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పీఎంకే సంస్థ ఆధ్వర్యంలో బన్సపల్లి ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.లక్ష వ్యయంతో పాఠ్యపుస్తకాలు, పరికరాలు, విద్యార్థులకు బ్యాగులు అందజేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తమకు, తమ పిల్లలకు ఎలాంటి పారితోషకాలు అవసరం లేదంటూ పాఠశాల ఆవరణలో గురువారం నిరసన తెలిపారు. సదరు సంస్థ అందజేసిన సామగ్రిని అక్కడి నుంచి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఫ్యాకర్టరీని తరలించాలని కోరారు. ఇందులో ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, బన్సపల్లి గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment