లక్ష్మణచాంద: పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇంకా మూడు నెలలే గడువు ఉంది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అయితే.. ఉదయం 8:30 గంటలకే స్టడీ అవర్స్ ప్రారంభం అవుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి ఉదయం 7 గంటలకే బయల్దేరుతున్నారు. ఇంట్లో వంట కాకపోవడంతో ఖాళీ కడుపుతో వస్తున్నారు. ఇక సాయంత్రం 5:30 గంటల వరకు స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లేసరికి 6:30 అవుతోంది. మధ్యాహ్న భోజనం మినహా వారికి ఎలాంటి అల్పాహారం అందడం లేదు. దీంతో ఆకలితో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
నిలిచిన పథకం..
గత ప్రభుత్వం 2023 దసరా సందర్భంగా పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇడ్లీ, ఉప్మా, పొంగల్ అల్పాహారంగా ఇచ్చేవారు. ఈ పథకాన్ని మరింతగా మెరుగుపర్చాలని రాష్ట్ర విద్యాశాశాఖ అధికారులు భావించినా కార్యరూపందాల్చడం లేదు. పథకం ప్రారంభమైన కొన్ని రోజులకే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో అల్పాహార పథకం అటకెక్కింది. ఈనేపథ్యంలో ఉదయం ఎలాంటి అల్పాహారం అందడం లేదు. ఇక సాయంత్రం గతంలో విద్యార్థులకు దాతల సాయంతో స్నాక్స్ అందించే వారు. ప్రస్తుతం తరగతులు ప్రారంభమైనా దాతలు ఇంకా ముందుకు రాలేదు.
3,820 మంది ‘పది’ విద్యార్థులు..
ఈ ఏడాది జిల్లాలోని 167 ప్రభుత్వ పాఠశాలల నుంచి 3,820 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి ఫలితాల్లో వరుసగా రెండేళ్లు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచి హ్యాట్రిక్ కొట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకు పాఠశాలకు వచ్చి సాయంత్రం 5:15 గంటల వరకు ఉంటున్నా రు. మధ్యాహ్న భోజనం మినహా మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరందరికీ అల్పాహారంతోపాటు స్నాక్స్ అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
దాతలు ముందుకు వస్తేనే...
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవ ర్స్ సమయంలో దాతలు ముందుకు వచ్చి తమ తోచిన విధంగా అల్పాహారం గతంలో అందజేశారు. ఈ విద్యా సంవత్సరం కూడా మండలంలోని వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కలిగిన గ్రామాలలో ఆయా గ్రామాలకు చెందిన మనసున్న దాతలు ముందుకు వచ్చి పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం కోసం తమవంతు సాయం అందించాలని జిల్లా విద్యాధికారి రామారావుతోపాటు ఆయా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
జిల్లా సమాచారం...
నిర్మల్‌లో మొత్తం ప్రభుత్వ ఉన్నత
పాఠశాలలు 167
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే
విద్యార్థులు 3,820
Comments
Please login to add a commentAdd a comment