నిర్మల్‌చైన్‌గేట్: గ్రూప్–2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రూప్–2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, లోకల్ రూట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గ్రూప్–2 పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నెల 15, 16తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్–2 పరీక్షలకు జిల్లాలో 8,080 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో 24 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ పీజీ రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment