పింఛన్ పెంపు ఎప్పుడో!
● నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ● ఆశతో నిరీక్షిస్తున్న లబ్ధిదారులు
నిర్మల్‌చైన్‌గేట్: అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని రూ.2,016 నుంచి రూ.5వేలకు పెంచుతామని కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరుస ఎన్నికలు రావడంతోనే కొంత ఆలస్యం జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
లబ్ధిదారుల ఎదురుచూపు
పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ పింఛన్ల పెంపుపై బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు, ప్రతిపాదనలు చేయలేదు. పింఛన్ల పెంపుపై మార్గదర్శకాలూ విడుదల కాకపోవడంతో పెంపు ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ కింద రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. పింఛన్ల పెంపుపై అంతగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు, లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే పెంచాలి
ప్రభుత్వం పింఛన్ ఎప్పుడు పెంచుతుందోనని ఆశగా ఎదురుచూస్తున్న. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచితే కొంత ఆసరాగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచాలి.
– ఎస్.లింగమ్మ, నిర్మల్
హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ గత శాసనసభ ఎన్నికల్లో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతోంది. ఇంకా పింఛన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వెంటనే పింఛన్ పెంచి ఇవ్వాలి.
– కోరిపెల్లి శ్రావణ్‌రెడ్డి
జిల్లాలో ఆసరా పింఛన్ల వివరాలు
మొత్తం పెన్షన్లు: 1,37,840
వృద్ధులు: 27,597
వితంతువులు: 35,587
దివ్యాంగులు: 9,626
గీత కార్మికులు: 267
నేత కార్మికులు: 43
ఒంటరి మహిళలు: 2,107
బీడీ కార్మికులు: 62,389
పైలేరియా బాధితులు: 49
Comments
Please login to add a commentAdd a comment