పిల్లలపై పైశాచికం! | - | Sakshi
Sakshi News home page

పిల్లలపై పైశాచికం!

Published Mon, Dec 23 2024 12:06 AM | Last Updated on Mon, Dec 23 2024 12:06 AM

పిల్ల

పిల్లలపై పైశాచికం!

2024 నవంబర్‌ 13న మంచిర్యాల వడ్డెర కాలనీకి చెందిన రాజేందర్‌ అదే కాలనీకి చెందిన 11 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి హైటెక్‌ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. భయబ్రాంతులకు గురైన బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. 2024, సెప్టెంబర్‌ 27న విద్యార్థిని సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన బొమ్మెన సాగర్‌ మద్యం మత్తులో ఇంట్లోకి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో నమోదైన పోక్సో కేసులు

సంవత్సరం ఆదిలాబాద్‌ మంచిర్యాల నిర్మల్‌ కుమురంభీం

2023 52 40 20 21

2024 40 45 26 16

ఆగని మృగాళ్ల అఘాయిత్యాలు

కఠిన చట్టాలున్నా మారని కామాంధుల తీరు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పోక్సో కేసులు

ఠాణాకు రాని సంఘటనలు అనేకం..

అప్రమత్తత, అవగాహన అవసరమంటున్న నిపుణులు

దిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఓ యువకుడు మద్యం మత్తులో 12 ఏళ్ల బాలికను మూడు గంటలపాటు నిర్బంధించాడు. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన చట్ల పోశెట్టి(25) మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలనీకి చెందిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేశాడు. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. అతడిని అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం నిందితుడి ఇంటిని దహనం చేశారు. కాగా, నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

మంచిర్యాలక్రైం: గంజాయి, మద్యం మత్తులో కా మాంధులు వావి వరసలు మర్చిపోతున్నారు. పిల్ల లు, వృద్ధులు అని కూడా చూడకుండా పైశాచికానికి ఒడిగడుతున్నారు. ఆడది అయితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలు, మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. కామాంధుల తీరు మారడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండగా, చాలామంది అవమానభారంతో గ్రామాల్లోనే పంచాయితీలు, జరిమానాలతో బయటకు రాకుండా చేస్తున్నారు.

బయటకు రాని ఘటనలెన్నో...

ఉమ్మడి జిల్లాలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. వీటిలో కొన్ని వెంటనే వెలుగులోకి వస్తుండగా.. మరికొన్ని ఇతర కేసుల విచారణ సమయంలోనో.. లేక బాఽధితులు అనారోగ్యానికి గురైనప్పుడో వెలుగుచూస్తున్నాయి. ఇక పరువు పోతుందన్న భయంతో కొందరు తల్లిదండ్రులు ఇలాంటి సంఘటనలను దాచిపెడుతున్నారు. నిందితులు తెలిసిన వారై ఉండటం, పోలీసుల దృష్టికి తీసుకెళే ్త బయటకు వచ్చాక మళ్లీ వేధిస్తారన్న భయంతో చాలామంది ఫిర్యాదు చేయడం లేదు. ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన చిరు వ్యాపారి కూతురును తన దగ్గరి బంధువే ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని దాచి ఉంచారు.

తల్లిదండ్రుల బాధ్యత...

ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, ఆటలు ఆడినా.. చిన్నారులు వారి దగ్గరకు వెళ్తారు. అందరూ మంచివారే.. అందరూ మనవారే అన్న భావనలో ఉంటారు. అయితే మంచితనం ముసుగులో కొందరు పిల్లలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. చుట్టూ ఉన్నవారు.. బంధువులు.. బాగా తెలిసినవారే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతీ సందర్భంలో పిల్లలను కనిపెట్టుకుని ఉండడం సాధ్యం కాదు. పిల్లలకు వారి శరీరంలో మార్పులను బట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో జాగ్రత్తలు వహించాలని వైద్యులు, పోలీసులు, మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వస్తే గమనించి, కారణాలను తెలుసుకోవాలంటున్నారు. ఇంట్లో మగ పిల్లలు అయితే తోటి పిల్లలతో, ముఖ్యంగా తమ చుట్టూ ఉన్న మహిళలు, బాలికలను ఏవిధంగా గౌరవించాలో నేర్పించాలని.. బాలికలకై తే తమ శరీరాన్ని ఎవరైనా తాకడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలో నేర్పించాలని పేర్కొంటున్నారు. గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలంటున్నారు. పిల్లలతో సమయం గడుపుతూ వారు చెప్పే విషయాలను స్నేహితులుగా శ్రద్ధగా వినాలని సూచిస్తున్నారు. పోలీస్‌, న్యాయశాఖ ద్వారా కూడా షీటీం బాలికల భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

మైనర్లను లైంగికంగా వేధిస్తే..

లైంగికదాడుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టానికి 2012లో ఆమోదం లభించింది. ఆ ఏడాది జూన్‌ 19న ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం తెలి పారు. జూన్‌ 20న గెజిట్‌లో నోటిఫై చేశారు. చట్టంలో పేర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలపక పోయినా 18 ఏళ్లలోపు బాలికలపై లైంగికదాడి జరిగితే అది నేరంగానే పరిగణించబడుతుంది. 16 ఏళ్లలోపు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా లైంగికదాడిగానే పరిగణిస్తారు. కొత్త చట్టం, నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు ఉన్న ఏ వ్యక్తికై నా ఇది వర్తిస్తుంది. నేరం రుజువైతే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. పిల్లలపై లైంగిక వేధింపులు, దాడి చేస్తే 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా, రెండోసారి అదే నేరం చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో జీవిత ఖైదు పడే అవకాశ ముంది.

బాధ్యతగా వ్యవహరించాలి

బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రతీ పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాలికలపై లైంగిక దాడులు జరిగినప్పుడు ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. నిందితులకు భయపడి కొందరు ఫిర్యాదు చేయడం లేదు. కొందరు రాజీ పడుతున్నారు. దీంతో నేరస్తులు తప్పించుకుంటున్నారు. తప్పుచేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయి. లైంగికదాడికి గురైన బాలికకు ప్రభుత్వ పరిహారం కూడా అందిస్తుంది.

– రాంబావ్‌, పోక్సో కోర్టు పబ్లిక్‌

ప్రాసిక్యూటర్‌, మంచిర్యాల

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే

పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. వారి కదలికలు, దిన చర్యలో వారు ఏం చేస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారు. వారి స్నేహితుల వివరాలు తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఎవరితో కూడా చనువుగా ఉండకుండా చూసుకోవాలి. సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కల్పించాలి. పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారు. ఎవరైనా వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం ఉంది. డయల్‌ 100కు కాల్‌ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారు.

– ఎం.శ్రీనివాస్‌,

రామగుండం పోలీస్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
పిల్లలపై పైశాచికం! 1
1/2

పిల్లలపై పైశాచికం!

పిల్లలపై పైశాచికం! 2
2/2

పిల్లలపై పైశాచికం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement