కొనసాగుతున్న సమగ్ర ఉద్యోగుల సమ్మె
నిర్మల్ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. 17 రోజులుగా ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిన మహానుభావుడని కొనియాడారు. ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనుడు అని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొన్నారు. 15 రోజుల ముందుగానే జిల్లా అధికారులకు సమ్మె నోటీసు అందించినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో కేజీబీవీ బోధనేతర సిబ్బంది, అకౌంటెంట్లు, ఏఎన్‌ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్కావెంజర్లు, వాచ్ ఉమెన్‌లు, స్వీపర్లు స్వచ్ఛందంగా సమ్మెలోపాల్గొని తోటి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కేజీబీవీలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై సమగ్ర శిక్ష ఉద్యోగులు మండిపడ్డారు. తాత్కాలిక బోధన సిబ్బందిని నియమించడం ఎంత మాత్రం సమంజసం కాదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వీరికి పీఆర్టీయూ టీఎస్ మామడ మండల ఉపాధ్యాయులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment