విద్యార్థుల ఇంటిబాట
టీచర్ల సమ్మెబాట..
సారంగపూర్/దిలావర్‌పూర్: డిమాండ్లు నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమ్మెబాటపట్టారు. 19 రోజులుగా బోధన సిబ్బంది పాఠశాలలకు రావడం లేదు. దీంతో విద్యాబోధన చేసేవారు లేక పాఠాలు నష్టపోతున్నారు. భోజనంపై పర్యవేక్షణ కరువవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బోధన ఆగిపోవడం, భోజనం నాసిరకంగా మారడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. సారంగాపూర్ మండలం జామ్, దిలావర్‌పూర్ గ్రామంలోని కేజీబీవీల విద్యార్థులు శనివారం ఇంటిబాట పట్టారు. చదువులు సాగడం లేదని, భోజనం సరిగా ఉండడం లేదని, పురుగుల అన్నం పెడుతున్నారని పిల్లలు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాలల వద్దకు చేరుకున్నారు. ఎంఈవోలు మధుసూదన్, శంకర్‌తో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని, వంట మనుషులను సైతం ఏర్పాటు చేసి భోజనం తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. అయితే భోజనం రుచిగా ఉండడం లేదని ఎంఈవోలతో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యత తీసుకుంటారా అని నిలదీశారు. దిలావర్‌పూర్ తహసీల్దార్ స్వాతి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. ఎస్సై సందీప్ పరిస్థితిపై ఆరా తీశారు. అన్నంలో పురుగులు వచ్చాయనీ, ఒక బొద్దింక కూడా వచ్చిందంటూ విద్యార్థినులు తెలిపారు. దీంతో చేసేది లేక ఎంఈవో మధుసూదన్ పిల్లలను తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చినవారితో సెలవు చీటీలు రాయించుకుని వారికి పిల్లలను అప్పగించారు. ఈవిషయమై ఎంఈవోను వివరణ కోరగా తమ తీసుకెళ్లడానికి సుముఖంగా ఉన్న తల్లిదండ్రులతో పిల్లలను పంపించామన్నారు.
విద్యార్థులు ఆందోళన చెందొద్దు
కేజీబీవీ విద్యార్థులు ఆందోళన చెందొద్దని కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని డీఈవో రామారావు అన్నారు. జామ్ గ్రామంలోని కేజీబీవీని శనివారం రాత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ సమ్మెకారణంగా ఎదుర్కొన్న సమస్యలను గురించి ఆరా తీశారు. అనంతరం బయటకు వచ్చిన డీఈవో మీడియాతో మాట్లాడారు. సమ్మెలో ఉన్న నాన్‌టిచింగ్ స్టాఫ్ కుక్, అసిస్టెంట్‌కుక్, డేఅండ్ నైట్ వాచ్‌ఉమెన్‌లు, ఏఎన్‌ఎం సహా ఇతర సిబ్బంది మొత్తం 10 మంది విధులకు హాజరైనట్లు వెల్లడించారు. త్వరలోనే టీచింగ్‌స్టాఫ్ కూడా సమ్మె విరమించి విధుల్లోకి చేరే అవకాశం ఉందని తెలిపారు.
చదువులు సాగక
నష్టపోతున్నామంటున్న విద్యార్థులు
భోజనం సరిగా లేక పస్తులుంటున్న వైనం..
తల్లిదండ్రుల ఆందోళనతో
ఇళ్లకు పంపుతున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment