మహా.. మట్టి దందా..! | - | Sakshi
Sakshi News home page

మహా.. మట్టి దందా..!

Published Fri, Jan 3 2025 12:14 AM | Last Updated on Fri, Jan 3 2025 4:48 PM

అసైన్డ్ భూముల్లో మొరం తవ్వడంతో ఏర్పడిన గుంత

అసైన్డ్ భూముల్లో మొరం తవ్వడంతో ఏర్పడిన గుంత

ఇనాం భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

మొరం తరలించుకుపోతున్న అక్రమార్కులు 

ప్రభుత్వ ఆదాయానికి గండి 

నోటీసులతోనే సరిపెడుతున్న రెవెన్యూ అధికారులు

జిల్లాలోని పేదలకు పంపిణీ చేసిన భూముల్లో మహారాష్ట్ర మట్టి దొంగలు అక్రమంగా మొరం దందా సాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ జిల్లాలోని మొరాన్ని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. కోట్లలో అక్రమ దందా సాగుతున్నా అధికారులు నోటీసులతో సరిపెడుతున్నారు. 

పేదలకు డబ్బులు ఆశ చూపి.. లీజు ఒప్పందాలు చేసుకుని నిత్యం వందల సంఖ్యలో లారీల్లో మొరం తరలించుకుపోతున్నారు. అనుమతులు లేకుండా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడ డం లేదు. గతంలో ఎల్వత్‌ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి మొరం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. కొన్ని రోజులు దందా ఆగి, తర్వాత యథావిధిగా, యథేచ్ఛగా సాగుతోంది.

తానూరు : తానూరు మండలంలో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్వత్‌ గ్రామ పంచాయతీ శివారులోని సర్వే నంబరు 177లో 63.17 ఎకరాల భూమిని ప్రభుత్వం 20 ఏళ్ల క్రితం 41 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. ఈ భూముల్లో ఎలాంటి తవ్వకాలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలులేదు. కొంత మంది లబ్ధిదారులు వ్యవసాయం చేసుకుంటున్నారు. కొందరి భూముల్లో పొదలు, బండరాళ్లు ఉండడంతో వాటిని అభివృద్ధి చేసుకుని సాగులోకి తెచ్చుకోలేక అలాగే వదిలేశారు. అయితే మహారాష్ట్రకు చెందిన అక్రమార్కులు యజమానుల వివరాలు తెలుసుకుని వారి వద్దకు వెళ్లి డబ్బులు ఆశ చూపి భూములను లీజుకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకున్నారు.

ఇందుకు ఎకరాకు రూ.20 వేల చొప్పున చెల్లించారు. అనంతరం మొరం దందా మొదలు పెట్టారు. ఈ లీజులు సాకుగా చూపుతూ పంచాయతీ, రెవెన్యూ, భూగర్భ శాఖ అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. యథేచ్చగా మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, ఉమ్రి, బిలోలి తదితర ప్రాంతాలకు తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అయినా అధికారులు అంతా ‘మామూలే’ అన్నట్లు చూస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 40 ఎకరాల్లో మట్టి దందా సాగుతోంది. ఇప్పటి వరకు 50 నుంచి 60 అడుగుల లోతు వరకు మొరం తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి.

రాత్రి వేళలో రవాణా..

అధికారుల కున్నుగప్పి నిత్యం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు పొక్లెయినర్లతో మొరం తవ్వి 30 నుంచి 40 టిప్పర్లలో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌, బిలోలి, ఉమ్రి రహదారుల నిర్మాణ పనుల కోసం, ధర్మాబాద్‌లో ఇంటి నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఇక మొరం తవ్వకాలతో ఏర్పడిన గుంతలవైపు వెళ్తున్న రైతులు, పశువులు అందులో పడి మరణిస్తున్నారు. ధర్మాబాద్‌ పట్టణానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఉగేవాడ్‌ సంబాజీ(40) తవ్వకాలు జరిపిన గుంతలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతిచెందాడు.

నోటీలతో సరి..

గుంతలతో జరుగుతున్న ప్రమాదాలపై గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాస్థాయి అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని మొరం తవ్వకాలను పరిశీలించారు. సంబంధిత రైతుల భూముల్లో మొరం తవ్వరాదని నోటీసులు అందించారు. తదుపరి చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. దీంతో అక్రమార్కులు ఎక్కడా తగ్గడం లేదు.

నోటీసులు ఇచ్చాం..

ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇనాం భూములను పంటల సాగుకు మాత్రమే వినియోగించాలి. ఎలాంటి మొరం తవ్వకాలు జరపరాదు. కొంత మంది మహా రాష్ట్ర వ్యాపారులు రైతులతో ఒప్పందం చేసుకుని మట్టి దందా మొదలు పెట్టారు. మా దృష్టికి వచ్చిన వెంటనే పరిశీలించారు. రైతులకు నోటీసులు ఇచ్చాం. మొరం తవ్వకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారుల వద్ద లీజుకు ఉన్న భూముల్లో పంటలు వేసుకునేలా చూస్తాం.

– లింగమూర్తి, తహసీల్దార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement