డంపింగ్ యార్డు సక్రమంగా నిర్వహించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: డంపింగ్ యార్డ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని డంపింగ్ యార్డ్‌ను శనివారం తనిఖీ చేశారు. రోజువారీగా డంపింగ్ యార్డ్‌కు వస్తున్న చెత్త, నిర్వహణ, సెగ్రిగేషన్ తదితర వివరాలు అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలోని ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను ఏరోజుకారోజు వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించాలన్నారు. సెగ్రిగేషన్ ప్రదేశంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు, పేపర్, తుక్కు, గాజు సీసా, అట్ట పెట్టెలను వేరుగా విభజించాలన్నారు. పునఃవినియోగానికి వీలున్న చెత్తను వేరుచేసి ఉంచాలని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ ఆవరణలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, పశుసంవర్ధక శాఖ అధికారి బాలీడ్ అహ్మద్, నిర్మల్ గ్రామీణ తహసీల్దార్ సంతోష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలను గుర్తించి, పూర్తిస్థాయిలో నిర్మూలించాలన్నారు. నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను కేవలం నిబంధనల మేరకు మాత్రమే సేకరించాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఆ నిర్మాణాల గుత్తేదారులకు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆయా నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక వివరాల నివేదికలను అందజేయాలని సూచించారు. నివేదికల ప్రకారమే ఆయా శాఖలో జరుగుతున్న నిర్మాణాలకు ఇసుక సరఫరా జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను కొనుగోలు చేయరాదన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఇసుక అక్రమ తవ్వకాలను, రవాణాను అరికట్టాలన్నారు. సమావేశంలో మైన్స్ ఏడీ రవీందర్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు శంకరయ్య, అశోక్‌కుమార్, సందీప్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment