అత్యవసర సేవలెలా?
● అమ్మ చెంత భక్తుల అవస్థలు ● బాసరలో రెస్క్యూటీం జాడేది? ● పెద్దాస్పత్రి లేక తప్పని ఇక్కట్లు ● కానరాని ఫైరింజన్ సౌకర్యం
భైంసా: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో అత్యవసర సేవలు కరువయ్యాయి. ఈ ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు నిత్యం వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. గంగమ్మకు మొక్కు తీర్చుకుంటారు. నామకరణాలు, పుట్టుపంచలు, శుభకార్యాలెన్నో ఇక్కడ జరుపుకొంటారు. రాష్ట్రంలో ఏకై క ట్రిపుల్ ఐటీ ఇక్కడే ఉండటంతో తొమ్మిది వేల మంది విద్యార్థులు ఇక్కడి విద్యనభ్యసిస్తున్నారు. మండల కేంద్రం కావడంతో చుట్టు పక్కల పల్లె జనం బాసరకు వస్తారు. వేలాది మంది రాకపోకలు కొనసా గిస్తుండగా నిత్యం రద్దీగా ఉండే ఇక్కడ అత్యవసర సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
అగ్ని ప్రమాదాలు సంభవిస్తే..
బాసర మండలంలో అగ్నిమాపక కేంద్రం అందుబాటులో లేదు. ప్రమాదాలు సంభవిస్తే భైంసా నుంచే అగ్నిమాపక శకటం ఇక్కడికి పంపిస్తారు. ముఖ్య పర్వదినాల్లో భైంసా నుంచే శకటాన్ని తీసుకువచ్చి సేవలకు సిద్ధంగా ఉంచుతారు. ప్రతీసారి ఏదైన ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో వచ్చే అగ్నిమాపక శకటం బాసరలో మాత్రం అందుబాటులో లేదు. ప్రమాదాలు సంభవించిన సమయంలో భైంసా నుంచి లేదంటే నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రసిద్ధ ఆలయమున్న బాసరలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని అంతా కోరుతున్నారు.
100 పడకల ఆస్పత్రి నిర్మించాలని..
భైంసా పట్టణంలోలాగే బాసరలోనూ 100 పడకల ఆస్పత్రి నిర్మించాలని ఎన్నో రోజులుగా ఈ ప్రాంతవాసులు విన్నవిస్తున్నారు. 100 పడకల ఆస్పత్రి ఉంటే ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, బాసర మండలవాసులు, ఆలయానికి వచ్చే భక్తులు, రైల్వే యాత్రికులకు నిరంతరం వైద్యసేవలు అందుతాయి. ఆపద సమయంలో అత్యవసర సేవలు అందితే ఎంతోమంది ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉంటుంది. బాసర ఆలయ విశిష్టత పెరుగుతున్నా అత్యవసర సేవలపై దృష్టిపెట్టడంలేదన్న ఆరోపణలు నిత్యం వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బాసర ప్రముఖ పుణ్యక్షేత్రం. బాసరను కలుపుతూ ధర్మాబాద్ మీదుగా నాందేడ్ వరకు, బిలోలిని కలుపుతూ దెగ్లూర్ వరకు, భైంసా పట్టణం గుండా నిర్మల్–లక్సెట్టిపేటనూ కలుపుతూ హైవేలున్నాయి. ఇక బాసర మీదుగా నిజామాబాద్‌కు ప్రధానరోడ్డు మార్గం ఉంది. తాజాగా బోధన్ పట్టణం మీదుగా జహీరాబాద్, మెదక్‌ను కలుపుతూ హైదరాబాద్ వరకు మరో హైవే నిర్మాణంలో ఉంది. ఇన్ని ప్రధాన రహదారులను కలిపే బాసరలో అత్యవసర సేవలపై దృష్టి పెట్టాలని భక్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వైద్యం, రక్షణ అంతంతే..
రోడ్డు ప్రమాదాలు జరిగినా.. పాముకాటుకు గురైనా.. స్నానఘట్టాలపై భక్తులు జారిపడ్డా.. రైల్వే ప్లాట్‌ఫాంపై కిందపడ్డా.. ఇక్కడ వైద్యసేవలు అందుబాటులో లేవు. బాసరలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మాత్రమే ఉంది. దీని స్థాయిని పెంచడం లేదు. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు, బాసర మండల వాసులు, భక్తులకు ఈ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు. ఇక్కడ జరిగే ప్రమాద ఘటనలపై ఎస్పీ జానకీషర్మిల స్పందించారు. ఇటీవలే భైంసా ఏఎస్పీ అనినాశ్‌కుమార్‌తో కలిసి ఇక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. గోదావరి నదికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిత్యం పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రమాదవశాత్తు గోదావరినదిలో పడ్డవారి ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లావైపు నుంచి బాసరవైపు వచ్చే మార్గాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశించారు. బాసరలో రెస్క్యూటీం అవసరమున్నా ఇప్పటికీ నియమించలేదు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా ఒక్క అంబులెన్స్ కూడా అందుబాటులో లేదు. గతంలో బాసర యువకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిసి సమస్య తెలిపితే అంబులెన్స్ మంజూరు చేయించారు. కానీ.. నాలుగు నెలలు తిరగకుండానే వైద్యాధికారులు ఆస్పత్రి నుంచి దానిని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారు. అత్యవసర సమయాల్లో 108కు సమాచారం ఇస్తే దూర ప్రాంతాల నుంచి బాసరకు అంబులెన్స్ సకాలంలో చేరుకునే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment